రామాయ‌ణం: రెండు రోజుల ముందే విదేశాల నుంచి రివ్యూలొచ్చేస్తే ఇబ్బందే క‌దా!

ఈ ఎపిక్ డ్రామాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. మొదటి భాగం 2026 దీపావళికి రానుండగా.. రెండవ భాగం `రామాయణ్ పార్ట్ 2`ను 2027 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Update: 2026-08-08 17:30 GMT

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణ్`. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ లాంచ్ వేదికగా ఈ సినిమా విడుదల తేదీలపై స్పష్టతనిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం సాంప్రదాయాన్ని పాటిస్తూ 6 నవంబర్ 2026న విడుదల చేస్తుండగా.. భారతదేశంలో మాత్రం దీపావళి పండుగ శుభముహూర్తాన 8 నవంబర్ 2026న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇండియా కంటే రెండు రోజుల ముందే (నవంబర్ 6న) విదేశాలలో ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో అక్కడి నుండి వచ్చే రివ్యూలు ఇండియన్ బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ మొదలైంది. రెండు రోజుల ముందే టాక్ - రేటింగ్‌లు సోషల్ మీడియాలో బయటకు రావడం వల్ల దాని ప్ర‌భావం భార‌త‌దేశంలో బ‌లంగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని కూడా ఒక అంచ‌నా. అయితే భారీ చిత్రాల విషయంలో విదేశీ ప్రీమియర్ల టాక్ ఎల్లప్పుడూ ప్రతికూలంగానే ఉండాలని లేదు.. సరైన కంటెంట్ ఉంటే అది భారతీయ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి ఇంధనంగా మారుతుంది.

గతంలో కూడా భారతీయ చిత్రసీమలో విదేశాలలో లేదా ఇండియా కంటే ముందే ప్రీమియర్లు వేసి.. అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాత దేశీయంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్,.. ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ 2` చిత్రాలు ఓవర్సీస్ ప్రీమియర్ల నుండే మైండ్ బ్లోవింగ్ రివ్యూలతో హీట్ పెంచాయి. ఆ ముందస్తు సమీక్షలు భారతీయ ప్రేక్షకులలో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లి.. తొలిరోజే వందల కోట్ల ఓపెనింగ్స్ రావడానికి దోహదపడ్డాయి. `రామాయణ్` విషయంలో కూడా పురాణేతిహాస‌ కథాంశంపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ అంతర్జాతీయంగా ముందే రిలీజ్ చేయడానికి ధైర్యం చేశారని భావించవచ్చు.

శ్రీరాముడి వనవాసం, సీతాపహరణం, లంకేశ్వరుడిపై సాధించే ధర్మ విజయం నేపథ్యంతో వస్తున్న ఈ ఎపిక్ డ్రామాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. మొదటి భాగం 2026 దీపావళికి రానుండగా.. రెండవ భాగం `రామాయణ్ పార్ట్ 2`ను 2027 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో అపూర్వమైన స్పందన లభించింది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్..తారాగణం లుక్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ట్రైలర్‌కు వచ్చిన గ్లోబల్ రెస్పాన్స్ చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల చిత్రం లోడింగ్ అని స్పష్టమవుతోంది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం విదేశీ రివ్యూల భయాలను పటాపంచలు చేస్తూ.. విశ్వవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. పండుగ వాతావరణంలో నవంబర్ 8న రాబోతున్న ఈ సినిమా భారతీయ చిత్రసీమ స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News