10 వేల‌ల‌ మందితో 'రామాయ‌ణ‌' జాతర: ఇండియన్ సినిమాలోనే రికార్డ్

భారతీయ చలనచిత్ర పరిశ్రమ వ్యాపార పరిధి, మేకింగ్ ప్రమాణాలు కాలంతో పాటు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి.

Update: 2026-05-19 04:48 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమ వ్యాపార పరిధి, మేకింగ్ ప్రమాణాలు కాలంతో పాటు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. ఒకప్పుడు వందల మందితో ముగిసిపోయే సినిమా నిర్మాణం.. నేడు వేలాది మంది శ్రమతో కూడిన ఒక భారీ యజ్ఞంలా మారుతోంది. గతంలో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, RRR వంటి సంచలన చిత్రాల సెట్స్‌లో ఒకేసారి వెయ్యి మందికి పైగా సిబ్బంది పని చేసేవారు. ఈ చిత్రాలలోని యుద్ద ఘట్టాలు, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సుల కోసం వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను, రౌడీ షీటర్లను-ఫైటర్లను సెట్స్‌పై ఉపయోగించారు. ఒకవైపు సెట్స్‌పై వేలాది మంది లీనమై ఉంటే... మరోవైపు పదుల సంఖ్యలో విభిన్న సాంకేతిక బృందాలు పేర‌ల‌ల్‌గా విజువల్ ఎఫెక్ట్స్ - ప్రొడక్షన్ పనులలో విస్తృతంగా పాల్గొని ఈ విజువల్ వండర్లను రూపొందించాయి.

ఇదే తరహా భారీతనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మరో అగ్ర దర్శకుడు శంకర్.. రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం 2.0 చిత్రం కోసం భారీగా ఆర్టిస్టులను గ్యాదర్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ స్టేడియం ఫైట్ సీన్- పతాక సన్నివేశాల కోసం.. అలాగే భారీతనం నిండిన లొకేషన్ల పాటల కోసం ఆయన వందలాది మంది లైవ్ ఆర్టిస్టులను, జూనియర్లను రంగంలోకి దించారు. శంకర్ తన సినిమాల్లోని ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్‌గా కనిపించడం కోసం ఏకంగా రికార్డ్ స్థాయిలో జూనియర్ ఆర్టిస్టుల బలగాన్ని నియమించేవారు. వీరితో పాటు సరికొత్త మోషన్ క్యాప్చర్ సాంకేతికత... హాలీవుడ్ విఎఫ్ఎక్స్ నిపుణుల సమక్షంలో ఒకే ప్రొడక్షన్ షెడ్యూల్ కింద వందలాది మంది టెక్నీషియన్లు ఈ రోబోటిక్ డ్రామా విజయం కోసం శ్రమించారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అడ్వెంచర్ డ్రామా వారణాసి కోసం కూడా మునుపెన్నడూ లేని విధంగా వంద‌లాది మంది ఒకే సమయంలో పని చేస్తుండటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం జక్కన్న కేవలం దేశీయ నటీనటులనే కాకుండా.. ప్రపంచ స్థాయి యాక్షన్ కొరియోగ్రాఫర్లను, అంతర్జాతీయ ఆర్టిస్టులను.. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను ఏకకాలంలో సెట్స్ పైకి తీసుకొచ్చారు. రాజమౌళి ఆలోచనలకు అనుగుణంగా సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. అత్యంత అత్యాధునిక కెమెరా టెక్నాలజీతో, నభూతో నభవిష్యతి అన్న చందంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో చాలామంది భాగ‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ పౌరాణిక చిత్రం `రామాయణ` సెట్స్ నుండి వస్తున్న లీకులు చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10,000 మందికి పైగా క్రూ మెంబర్స్ (సిబ్బంది) పని చేస్తున్నట్లు సమాచారం. ఒకే ఒక్క క్రేజీ ప్రాజెక్టు కోసం ఇంత భారీ సంఖ్యలో సాంకేతిక నిపుణులు, శ్రామికులు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఒకే తాటిపైకి రావడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. కేవలం మనుషుల సంఖ్యలోనే కాకుండా.. నమితా మల్హోత్రా నిర్మాణ సారథ్యంలో...డిఎన్ఇజి- ప్రైమ్ ఫోకస్ వంటి దిగ్గజ సంస్థల స‌హ‌కారంతో ఈ చిత్రం ఏకంగా రూ. 4000 కోట్ల కళ్లు చెదిరే భారీ వ్యయంతో గ్లోబల్ విజువల్ వండర్‌గా రూపొందుతోంది.

సరిహద్దులు చెరిపేస్తూ సాగుతున్న ఈ ప్రయాణంలో `రామాయణ` కోసం ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్‌, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ వంటి విభాగాల కోసం గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా అంతర్జాతీయ సాంకేతిక బృందాలను రంగంలోకి దించారు. కేవలం ఒక ప్రాంతానికో .. ఒక భాషకో పరిమితం కాకుండా వందలాది మంది ఆర్టిస్టులు, జూనియర్ నటులు ఈ పౌరాణిక ఇతిహాసంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ విధంగా బాహుబలి, 2.0 చిత్రాల నుంచి మొదలైన వంద‌లాది మంది మనుషుల శ్రమ.. నేడు `వారణాసి`, `రామాయణ` చిత్రాల నాటికి పదివేల మంది సిబ్బంది స్థాయికి చేరింది. భారతీయ చలనచిత్ర రంగాన్ని అంతర్జాతీయ బాక్సాఫీస్ రేసులో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఈ మాన‌వ వ‌న‌రుల శ్ర‌మ‌, సాంకేతిక నైపుణ్యాల శ‌క్తి అత్యంత ముఖ్య‌మైన‌ది.

Tags:    

Similar News