మూవీ రివ్యూ : రమణి కళ్యాణం
ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన చిత్రాల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తించిన చిత్రం.. రమణి కళ్యాణం. ప్రోమోలతో క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం.. వెండితెర మీద ఎలాంటి అనుభూతిని కలిగించింది? తెలుసుకుందాం పదండి.
రమణి కళ్యాణం మూవీ రివ్యూ
నటీనటులు: దీప్షిక చంద్రన్ - సూర్య వశిష్ఠ- శ్రీనివాసరెడ్డి - యాంకర్ శ్యామల- చైతన్య జొన్నలగడ్డ- ప్రభావతి తదితరులు
సంగీతం: సూరజ్ కురుప్
ఛాయాగ్రహణం: అరవింద్ తిరుకోవెల
మాటలు: రామ్ జగదీశ్
నిర్మాతలు: విజయ్ ఆదిరెడ్డి- మనోజ్ చింతిరెడ్డి-శ్రీనాథ్ పసుపులేటి-సంజయ్ వెంపరాల
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి
ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన చిత్రాల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తించిన చిత్రం.. రమణి కళ్యాణం. ప్రోమోలతో క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం.. వెండితెర మీద ఎలాంటి అనుభూతిని కలిగించింది? తెలుసుకుందాం పదండి.
కథ: సంజన (దీప్షిక చంద్రన్) చిన్నతనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులనే కాక.. కళ్లనూ కోల్పోతుంది. అయినా ఆమె వైకల్యాన్ని పట్టించుకోకుండా ఒక పెద్దావిడ.. నలుగురు పిల్లలతో కలిసి ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంటుంది. ఒక పబ్ లో సింగర్.. ఒక ఎఫ్ఎంలో రేడియో జాకీగా పని చేస్తున్న సంజనకు.. రాజ్ (సూర్య వశిష్ఠ) పరిచయం అవుతాడు. అతను ఒక ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయి వికలాంగుడవుతాడు. అప్పటిదాకా డిప్రెషన్లో ఉన్న అతడికి.. సంజన పరిచయంతో జీవితం మీద కొత్త ఆశలు మొదలవుతాయి. వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్న సమయంలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. వీరి పెళ్లికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంతకీ సంజన-రాజ్ జంటకు ఎదురైన సమస్య ఏంటి.. దాన్ని ఆ జంట అధిగమించిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: వైకల్యం శరీరానికే తప్ప మనసుకు కాదని చెప్పే స్లైస్ ఆఫ్ లైఫ్ తరహా కథతో తెరకెక్కింది ‘రమణి కళ్యాణం’. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకునే నేటితరం యువతకు ఇందులో మంచి సందేశం ఉంది. అంధురాలు అయినా సరే.. ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగిపోయే కథానాయిక పాత్ర ఇందులో మేజర్ హైలైట్. ఒక పాత్రను చక్కగా తీర్చిదిద్దితే సినిమా మీద అది ఎంత మంచి ఫీలింగ్ తీసుకొస్తుందో చెప్పడానికి ఈ క్యారెక్టర్ ఉదాహరణ. కులం.. ఆస్తి.. ఇగో లాంటి కారణాలు కాన్ఫ్లిక్ట్ పాయింట్లుగా నడిచే ప్రేమకథల మధ్య.. అంధురాలైన హీరోయిన్-వికలాంగుడైన హీరో మధ్య లవ్ స్టోరీ భిన్నంగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పాత్రలు.. వాటి మధ్య కొన్ని హృద్యమైన సన్నివేశాలు.. మంచి సందేశం.. ‘రమణి కళ్యాణం’ను ఎంగేజింగ్ గా మారిస్తే.. ఓవర్ డోస్ ఎమోషన్లు.. సాగతీతగా సాగే సీన్లు అనుభూతిని కొంచెం తగ్గించాయి.
బ్లైండ్ హీరోయిన్.. హ్యాండిక్యాప్డ్ హీరో.. ఇలా ప్రధాన పాత్రలను వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవడం వల్ల.. ఆ క్యారెక్టర్ల చుట్టూ కొత్త సీన్లు ప్రెజెంట్ చేయడానికి అవకాశం దక్కింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర భలేగా అనిపిస్తుంది. ప్రథమార్ధం అంతా ఈ పాత్రనే హైలైట్ అవుతుంది. అంధురాలైనప్పటికీ గాయనిగా.. ఆర్జేగా ప్రతిభను చాటుకుంటూ చాలా చలాకీగా కనిపించే ఈ క్యారెక్టర్ ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొస్తుంది. బ్లైండ్ అనే విషయం తెలియకుండా హీరోయిన్ మేనేజ్ చేసే సీన్లు వినోదాన్ని పంచుతాయి. తర్వాత హీరో పాత్ర పరిచయం.. కథానాయికతో అతడి ట్రావెల్ సీన్లు కూడా ఓకే అనిపిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ డెవలప్ అయ్యే సీన్లు అంతగా పండకపోయినా.. ప్రథమార్ధంలో పెద్దగా కంప్లైంట్లు కనిపించవు.
ఐతే ప్రథమార్ధం వరకు ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చే ‘రమణి కళ్యాణం’ సెకండాఫ్ లో గాడి తప్పుతుంది. సన్నివేశాలు సాగతీతగా మారి.. సినిమా ఫిలసాఫికల్ రూట్లోకి వెళ్లిపోవడంతో కథనం నత్తనడకన సాగుతుంది. కథలో పెద్దగా మలుపులు కూడా కనిపించవు. హీరో హీరోయిన్ల పెళ్లికి బ్రేక్ పడడం వెనుక కారణాలు కొంత ఆసక్తి రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ ట్విస్టు ఊహించదగిందే కానీ.. ఆకట్టుకుంటుంది. ప్రేమకథలో బలం కొరవడడం వల్ల వారి మధ్య గ్యాప్ వచ్చినపుడు ఎమోషన్ సరిగా పండలేదు. హీరోయిన్ తల్లిదండ్రులకు.. హీరోకు మధ్య పెట్టిన కనెక్షన్ ‘ఆనంద్’ సినిమాను గుర్తుకు తెస్తుంది. హీరోయిన్ కోసం హీరో చివరగా ఏం చేశాడన్నది ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. హీరో హీరోయిన్లు కాకుండా మిగతా పాత్రలపై సరిగా దృష్టిపెట్టకపోవడం సినిమాలో మైనస్ అయింది. కానీ ఈ రెండు క్యారెక్టర్లు చాలా వరకు సినిమాను భుజాల మీద మోశాయి. వారి మధ్య ప్రేమకథను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దుకుని ఉంటే.. సెకండాఫ్ క్రిస్ప్ గా ఉండుంటే ‘రమణి కళ్యాణం’ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచేది. అయినా సరే ఒకసారి చూడ్డానికి ఇది ఓకే అనిపించే చిత్రమే.
నటీనటులు: ‘రమణి కళ్యాణం’ టైటిల్ కు తగ్గట్లే ఇది కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా. కథంతా తన చుట్టూనే తిరిగే పాత్రలో దీప్షిక చంద్రన్ భలేగా నటించింది. కళ్లు లేని అమ్మాయిగా తన హావభావాలు కట్టి పడేస్తాయి. ప్రేరణ కలిగించేలా సాగే తన పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. సినిమా అంతా వీల్ ఛైర్ కు పరిమితం అయిన పాత్రలో సూర్య వశిష్ఠ కూడా బాగా నటించాడు. ఎమోషన్లను బాగా పలికించాడు. ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించే శ్రీనివాసరెడ్డి.. ఇందులో సీరియస్ టచ్ ఉన్న భిన్నమైన పాత్రలో మెప్పించాడు. చైతన్య జొన్నలగడ్డ.. యాంకర్ శ్యామల.. ప్రభావతి.. వీళ్లంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం: ‘రమణి కళ్యాణం’ సాంకేతికంగా మెప్పిస్తుంది. సూరజ్ కురుప్ మంచి పాటలు ఇచ్చాడు. రెండు సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. తన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ అరవింద్ తిరుకోవెల పాటల చిత్రీకరణలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. విజువల్స్ ఆద్యంతం కలర్ ఫుల్ గా సాగాయి. నిర్మాతలు ఈ కథకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. ‘కోర్ట్’ డైరెక్టర్ రామ్ జగదీశ్ ఈ సినిమాకు మాటలు రాయడం విశేషం. కొన్ని చోట్ల లోతైన సంభాషణలు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల మాటల్లో ఫిలాసఫీ ఎక్కువైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి రొటీన్ కు భిన్నమైన ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు. కథ విషయంలో.. కొన్ని సన్నివేశాల వరకు అతడికి మంచి మార్కులు పడతాయి. కాకపోతే భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించడంలో కాస్త తడబడ్డాడు. ఓవర్ డోస్ ఎమోషన్లు.. మరీ ఫిలసాఫికల్ గా అనిపించే డైలాగులు సినిమా అనుభూతిని కొంతమేర ప్రభావితం చేశాయి.
చివరగా: రమణి కళ్యాణం.. మంచి ప్రేమకథే కానీ
రేటింగ్-2.5/5