'రామ్' మరో రిస్క్ చేస్తున్నాడా? ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యేనా?

'ఆంధ్ర కింగ్ తాలూకా' విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. బాక్సాఫీస్ వద్ద ఆశించిన బ్రేక్ రావడంతో, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తన తర్వాతి అడుగులు వేస్తున్నాడు.;

Update: 2025-11-29 21:30 GMT

'ఆంధ్ర కింగ్ తాలూకా' విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. బాక్సాఫీస్ వద్ద ఆశించిన బ్రేక్ రావడంతో, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తన తర్వాతి అడుగులు వేస్తున్నాడు. అయితే ఈసారి రామ్ ఎంచుకున్న కాంబినేషన్ చూస్తుంటే ఇండస్ట్రీలో ఆసక్తితో పాటు చిన్నపాటి చర్చ కూడా మొదలైంది. మూడు ఇండస్ట్రీలను కలుపుతూ రామ్ వేసిన ఈ కొత్త స్కెచ్ వర్కవుట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు విషయానికి వస్తే.. రామ్ తన తర్వాతి సినిమాను ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్షన్ లో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను కన్నడలో భారీ చిత్రాలు నిర్మించే కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. అంటే తెలుగు హీరో, తమిళ డైరెక్టర్, కన్నడ ప్రొడ్యూసర్ అన్నమాట. వినడానికి వెరైటీగా ఉన్నా, ఇక్కడే రామ్ గత అనుభవాలు ఫ్యాన్స్ ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి.

గతంలో రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి 'ది వారియర్' చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు మళ్ళీ మరో తమిళ డైరెక్టర్ తో రామ్ జతకట్టడం సాహసమే అనిపిస్తోంది. సముద్రఖని టేకింగ్ బాగుంటుందని పేరున్నా, తెలుగులో ఆయన ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా ఏమీ లేదు.

సముద్రఖని తెలుగులో రవితేజతో 'శంభో శివ శంభో', నానితో 'జెండాపై కపిరాజు' సినిమాలు చేశారు. కంటెంట్ పరంగా ఓకే అనిపించినా, కమర్షియల్ గా అవి వర్కవుట్ కాలేదు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో తీసిన 'బ్రో' సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. నటుడిగా బిజీగా ఉన్న సముద్రఖని, దర్శకుడిగా మాత్రం తెలుగులో ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయారు.

అయితే ఇక్కడో పాజిటివ్ పాయింట్ ఉంది. రామ్ ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న కథలనే ఇష్టపడుతున్నాడు. సముద్రఖని సినిమాల్లో ఎమోషన్, మెసేజ్ బలంగా ఉంటాయి. 'ఆంధ్ర కింగ్ తాలుకా'లో రామ్ ఎమోషనల్ యాంగిల్ చూశాక, బహుశా సముద్రఖని రామ్ కోసం ఏదైనా బరువైన కథను సిద్ధం చేశాడేమో అనిపిస్తోంది. కేవీఎన్ లాంటి పెద్ద బ్యానర్ తోడుగా ఉండటం సినిమాకు కలిసొచ్చే అంశం.

ఏదేమైనా రామ్ తీసుకున్న ఈ నిర్ణయం అటు ఆసక్తిని, ఇటు అనుమానాలను రేకెత్తిస్తోంది. తమిళ దర్శకులతో రామ్ కు కలిసిరాదనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి, సముద్రఖని ఈసారి కమర్షియల్ గా ప్రూవ్ చేసుకుంటారో లేదో చూడాలి. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News