రామ్ స్వీయా దర్శకత్వంలో రెడీ అవుతున్నాడా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ ఆసక్తికర మలుపులో ఉందా? అంటే అవుననే అనాలి. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత రామ్ సక్సెస్ కు దూరమైన సంగతి తెలిసిందే.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ ఆసక్తికర మలుపులో ఉందా? అంటే అవుననే అనాలి. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత రామ్ సక్సెస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. చివరిగా `ఆంధ్రా కింగ్ తాలూకా` అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. స్టోరీ ప్లాట్ సహా మేకింగ్ కూడా బాగుందనే ప్రశంసలు దక్కాయి. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మాత్రం ఆదరణ దక్కలేదు. దీంతో రామ్ ఖాతాలో ఈ చిత్రం కూడా ఓ పరాజయంగానే కనిపిస్తుంది.
ఇలా బయటి దర్శకుల విజన్ మీద ఆధారపడి రామ్ చేసిన సినిమాలేవి ఆశించిన ఫలితాలు సాధించలేదు. తన బాడీ లాంగ్వేజ్‌కు -ఎనర్జీకి తగ్గ కథలగా అవేవి హైలైట్ కాలేదు. ఈ నేపథ్యంలో రామ్ సొంతగా కథలు రాయడం కూడా మొదలు పెట్టినట్లు కొంత కాలంగా ప్రచారంలో ఉంది. తనని తానే స్టార్ గా మార్చుకునేందుకు తానే కలం పట్టి సీరియస్ గా కథ రాస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ కథను మరో దర్శకుడికి అప్పగించి పట్టాలెక్కించాలన్నది రామ్ మొదటి ప్లాన్. అయితే ఇప్పుడా ప్లాన్ లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రామ్ ఓ సాహసోపేతమైన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఈ కథను రామ్ స్వయంగా డైరెక్టర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడుట. తాను అనుకున్న భావోద్వేగాన్ని, యాక్షన్ తీవ్రతను మరో దర్శకుడు తెరపైకి తీసుకురాగలరా? అనే సందేహం ఆయనలో కలిగినట్లు తెలుస్తోంది. తన మనసులో ఉన్న ఆలోచనను వంద శాతం తెరపై ఆవిష్కరించాలంటే తానే మెగాఫోన్ పట్టడం ఉత్తమమని రామ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే రామ్ కూడా స్వీయ దర్శకత్వంలో నటించే హీరోల జాబితాలోకి చేరిపోతారు. నటుడిగా రామ్‌కు ఉన్న ఎనర్జీ, మాస్ అప్పీల్ దర్శకుడిగా ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.
తన వీక్ పాయింట్స్ ఏంటి? ప్రేక్షకులు తన నుండి ఏం కోరుకుంటున్నారు? అనేది ఆయనకు బాగా తెలుసు. అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలు కూడా తమ కథలను తామే రాసుకుని, దర్శకత్వ పర్యవేక్షణ చేసి విజయాలు అందుకున్నారు. అదే బాటలో రామ్ కూడా తన సృజనాత్మకతను నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రామ్ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్‌లోనే ఈ ప్రయోగాన్ని చేసే అవకాశం ఉంది. బయటి దర్శకులతో ప్రయోగాలు చేసి రిస్క్ తీసుకోవడం కంటే? తన విజన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లడం మేలని రామ్ బలంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం రామ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు