రామ్ నెక్స్ట్ .. ఇంకా టైం పడుతుందా?

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని గట్టిగా ఫోకస్ పెట్టారు.;

Update: 2026-04-19 01:30 GMT

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని గట్టిగా ఫోకస్ పెట్టారు. గతంలో వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో.. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన రెండు సినిమాలు కూడా అంచనాలకు తగ్గట్టు ఆడకపోవడం రామ్‌ ను మరింత ఆలోచనలో పడేసింది.

నిజానికి.. ఇప్పటి వరకు మాస్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్.. ఇకపై రొటీన్ కథల కంటే భిన్నమైన కాన్సెప్టులు ఎంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ, మళ్లీ సక్సెస్ ట్రాక్‌ లోకి రావాలని ఆయన భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఆంధ్రా కింగ్ తాలూకా విడుదలైన వెంటనే రామ్ తన కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పటి వరకు ఆ వార్తలు నిజం కాలేదు. ఇప్పటికీ ఆయన తదుపరి సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కనీసం ప్రాజెక్ట్‌ పై క్లారిటీ ఇచ్చే అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో రామ్ నెక్స్ట్ మూవీ ఇంకెప్పుడు.. అసలేం జరుగుతుందోనని సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ శిష్యుడైన దర్శకుడు విఘ్నేష్ తో రామ్ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఆ కాంబినేషన్ ఖరారైందనే వార్తలు టాలీవుడ్‌ లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ కోసం ఒక కథ కూడా సిద్ధంగా ఉందని సమాచారం. అది రామ్.. తన సినిమా కోసమే రాసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే కొన్ని కారణాల వల్ల దర్శకుడు విఘ్నేష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ కథను అలాగే కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న రామ్.. దాన్ని తెరకెక్కించే సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రామ్ తదుపరి సినిమా ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకుండా, అన్ని అంశాలు సరిచూసుకుని మాత్రమే ప్రాజెక్ట్‌ ను ప్రారంభించాలని రామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఈసారి తొందరపడకుండా, కచ్చితమైన ప్లానింగ్‌ తో ముందుకు వెళ్లాలని చూస్తున్నారట. అయితే వరుస ఫ్లాప్‌ల తర్వాత సరైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న రామ్, తన తదుపరి సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. అభిమానులు కూడా ఆయన నుంచి ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News