ఆర్జీవీ మారిన మనిషి అనుకోవచ్చా?
రామ్ గోపాల్ వర్మ `నా ఇష్టం` పుస్తకం, రామూయిజం -యూట్యూబ్ వీడియోల ప్రభావం అభిమానులపై అంతా ఇంతా కాదు.;
రామ్ గోపాల్ వర్మ `నా ఇష్టం` పుస్తకం, రామూయిజం -యూట్యూబ్ వీడియోల ప్రభావం అభిమానులపై అంతా ఇంతా కాదు. ఆయనలా తార్కికంగా ఆలోచించే వేరొకరు లేరని అంగీకరించాల్సిందే. ఒక సమస్యను ఇంతగా విశ్లేషణాత్మక ధోరణితో చూసేవాళ్లు వేరొకరు లేరు. క్రైమ్‌ని, దాని చుట్టూ ఉండే పరిస్థితులను అతడు గొప్పగా విశ్లేషించగలడు. ఫిలాసఫీ, సైకాలజీ వంటి సబ్జెక్టులను ఆర్జీవీ ఎంతగా ఔపోషణ పట్టాడో కూడా అతడి మాటలను బట్టి అర్థం చేసుకునేవాళ్లకు అర్థం చేసుకున్నంత. కానీ అతడు అనవసరంగా కొన్ని వివాదాలతో అంటకాగడం, బహిరంగంగా చిలిపి వేషాలు వేయడం లేదా మహిళలను టీజ్ చేయడం వంటి వేషాలతో కొంత అసహ్యకరమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా రాజకీయ పార్టీలను కెలకడం, దుష్ఠ నాయకులతో గొడవలు పెట్టుకోవడం వంటివి కూడా ఇమేజ్ కి డ్యామేజ్ తెచ్చాయి.
అదంతా గతం అనుకుంటే వర్తమానంలో ఆర్జీవీ మారిన మనిషి... దీనిని నమ్ముతారో లేదో కానీ, ఆయన కూడా ఒక రొటీన్ మనిషిలా మారాడు. అతడు కూడా గుంపులో గోవిందంలా పద్ధతిగా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకుముందులా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పడం లేదు. అనవసరంగా కన్ఫ్యూజ్ చేయడం మానుకున్నాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం.. చాలా తెలివిగా ట్రిక్కీగా సమాధానాలివ్వడం చేస్తున్నాడు.
వీటన్నిటినీ మించి తన శత్రువులను కూడా మిత్రులను చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవిని క్షమాపణ కోరడం, గతాన్ని తలచుకుని ఆవేదన చెందడం, చరణ్ చికిరి చికిరిని ప్రశంసించడం, వారణాసి టీజర్ పై పొగడ్తలు.. ఇవన్నీ ఆర్జీవీలో మార్పును సూచిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇటీవల శత్రువులను కూడా మిత్రులను చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నాడా ఆర్జీవీ? ఐబొమ్మ రవి అంశాన్ని కూడా ఎంతో తార్కికంగా విశ్లేషించి ఆశ్చర్యపరిచిన ఆర్జీవీ..ఇప్పుడు మారిన మనిషి అనుకోవాలా?
రణ్ వీర్ సింగ్- ఆదిత్యాధర్‌ల `దురంధర్` చిత్రాన్ని కూడా ఆర్జీవీ ప్రశంసించాడు. భారతీయ సినిమా ఒక పెద్ద ముందడుగు! అని కీర్తించాడు. చిత్ర దర్శకుడు ఆదిత్యాధర్ పనితనాన్ని కూడా ఆర్జీవీ పొగిడేసారు. ఇక వర్మ అంతటివాడే పొగిడేయడంతో ఆదిత్యాధర్ తన ఆనందాన్ని, అభిమానాన్ని దాచుకోలేకపోయారు. తన అభిమాన దర్శకుడు ఆర్జీవీ సినిమాల ప్రభావం తనపై ఎలా ఉందో కూడా ఆయన వెల్లడించారు.
ఆర్జీవీ ఒకప్పుడు అనుసరించిన విధానానికి ఇటీవలి కాలంలో ప్రవర్తనకు పోలిక చూస్తే, అతడు మారిన జెంటిల్మన్ లా కనిపిస్తున్నాడు.. గత ప్రవర్తనకు ఇప్పటి తీరుకు అసలు పొంతన అన్నదే లేకుండా ఉంది. ఇప్పుడు ఆయన పక్కా జెంటిల్మన్‌గా మారుతున్నాడు. మునుముందు ఇది మరింత పరివర్తనగా మారితే, మళ్లీ ఆయన నుంచి మునుపటిలా మోడ్రన్ డే కల్ట్ క్లాసిక్స్ ని కూడా ఆశించవచ్చు.