సౌత్‌ను పొగిడిన వర్మే… ఇప్పుడు సౌత్ హీరోలకు క్లాస్?
అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి కూడా వర్మ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు.;
ఒకప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. శివ, రంగీలా, సత్య లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో కొత్త దిశ చూపించిన వర్మ, ప్రస్తుతం మాత్రం తన పాత ఫామ్‌ను పూర్తిగా కోల్పోయారనే అభిప్రాయం రోజురోజుకీ బలపడుతోంది. సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ ద్వారానే ఆయన పేరు వినిపిస్తోంది.
ఇటీవల వర్మ చేసిన ట్వీట్లు మరోసారి చర్చకు దారి తీశాయి. ధురంధర్ సినిమాలో చూపించిన హీరోయిజాన్ని చూసి సౌత్ హీరోలు నేర్చుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే వర్మ గతంలో సౌత్ సినిమాల గొప్పతనాన్ని పొగుడుతూ, బాలీవుడ్ వాళ్లు సౌత్ నుంచి నేర్చుకోవాలని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ టైమ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి కూడా వర్మ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. హీరోయిజం అంటే ఏంటి? ఇంటెన్సిటీ అంటే ఎలా ఉండాలో వంగా సినిమాల ద్వారా అర్థమవుతుందని అప్పట్లో చెప్పిన వర్మ, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన స్టాండ్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల ఆయన చేసిన కామెంట్స్‌లో బాలీవుడ్ స్టార్లపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. ధురంధర్ వంటి సినిమాపై ఎందుకు ఎవరూ స్పందించడం లేదని ప్రశ్నిస్తూ, బీజేపీ కార్యకర్తల మాదిరిగా మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు వర్మపై మరోసారి ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.
ఇప్పటికే వర్మను సీరియస్‌గా తీసుకునే ప్రేక్షకులు తగ్గిపోయారనే భావన అందరిలోనూ ఉంది. ఆయన ఏదైనా కామెంట్ చేస్తే అది కేవలం కాంట్రవర్సీ కోసమే అన్న అభిప్రాయం ఏర్పడింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్న వర్మ, ఇప్పుడు సోషల్ మీడియా కామెంటేటర్‌గా మారిపోయారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వర్మ అభిమానులు మాత్రం ఈ పరిస్థితిని చూసి నిరాశ చెందుతున్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీసి మళ్లీ తన పాత గౌరవాన్ని సంపాదించాలని వారు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే, ఆ దిశగా వెళ్లే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి, ఒకప్పుడు ఇండస్ట్రీని ప్రభావితం చేసిన దర్శకుడు ఇప్పుడు కాంట్రవర్సీలకు పరిమితమవ్వడం సినీ ప్రియులను బాధిస్తోంది.