చిరంజీవికి సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. ఎందుకంటే?

సినిమాలోని సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయిందన్న చిరు.. నాగార్జున ఇంటెన్స్ యాక్టింగ్ అద్భుతమంటూ కొనియాడారు.;

Update: 2025-11-09 09:11 GMT

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి సారీ చెబుతూ పోస్ట్ పెట్టగా.. తెగ చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగింది? ఆర్జీవీ ఎందుకు సారీ చెప్పారంటే?

రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ మూవీ శివ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. 1989లో రిలీజ్ అయిన ఆ సినిమాలో కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో నటించగా, ఆర్జీవీ తెరకెక్కించారు. ఇప్పుడు 4కే రీస్టోరేషన్ తో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. నవంబర్ 14వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

దీంతో అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు.. శివ రీ రిలీజ్ కు విషెస్ చెబుతున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా చిరంజీవి కూడా వీడియో రిలీజ్ చేశారు. తాను అప్పట్లో శివ మూవీని చూసినప్పుడు పూర్తిగా ఆశ్చర్యపోయానని తెలిపారు. అది సాధారణ చిత్రం కాదని, ఒక విప్లవమని, తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిందని అన్నారు.

సినిమాలోని సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయిందన్న చిరు.. నాగార్జున ఇంటెన్స్ యాక్టింగ్ అద్భుతమంటూ కొనియాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్ అప్పట్లో టాలీవుడ్ కు కొత్తదనాన్ని తెచ్చాయని తెలిపారు. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త దారి చూపించారంటూ హ్యాట్సాఫ్ చెప్పారు.

దీంతో మెగాస్టార్ చిరంజీవి వీడియోను షేర్ చేస్తూ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ థ్యాంక్స్ చెప్పారు. అంతే కూడా క్షమాపణలు కూడా చెప్పారు. శివ మూవీని ప్రమోట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చిరంజీవి గారు అంటూ రాసుకొచ్చారు. తాను ఎప్పుడైనా అనుకోకుండా బాధ పెట్టినట్లయితే క్షమించాలని చిరును కోరారు.

ఏదేమైనా మెగాస్టార్ విశాల హృదయానికి మళ్లీ ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ ఫుల్ వైరల్ అవుతోంది. అయితే గతంలో ఆర్జీవీ.. మెగా ఫ్యామిలీపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు చిరంజీవి మాత్రం వాటిని పక్కన పెట్టి.. సినిమా గురించి ట్వీట్ చేసి.. తన మంచి వ్యక్తిత్వాన్ని చూపించారు. దీంతో అంతా మెగాస్టార్ పై నెట్టింట ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.


Tags:    

Similar News