ప్రధాని మోదీని కలిసిన చరణ్.. ఉపాసన స్పెషల్ గిఫ్ట్..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది;

Update: 2025-10-11 16:34 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్న చరణ్.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమయంలో ఆయన వెంట సతీమణి ఉపాసన కూడా ఉన్నారు.

ఆ విషయాన్ని రామ్ చరణ్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు మోదీని కలిసినట్లు చెప్పారు. అయితే అనిల్‌ కామినేని సారథ్యంలో వరల్డ్‌ ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తుండగా.. చెర్రీ బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నారు.

ఆర్చరీ ఫస్ట్ లీగ్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా రామ్ చరణ్ దంపతులు, అనిల్ కామినేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్‌ చరణ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

"అనిల్ కామినేని గారు నేతృత్వంలో జరిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయంపై మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీని కలవడం గౌరవంగా భావిస్తున్నా. మోదీ గారి మార్గదర్శకత్వం, క్రీడల పట్ల మక్కువ ప్రపంచవ్యాప్తంగా ఆర్చరీ వారసత్వాన్ని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మాకు ఎంతో సహాయపడుతుంది" అని చెర్రీ చెప్పారు.

"అథ్లెట్స్ కు నా అభినందనలు. మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఈ అద్భుతమైన క్రీడలో ఇంకా చాలా మంది చేరుతారని మేము ఆశిస్తున్నాం" అని తెలిపారు. ఆర్చరీ లీగ్ తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వారికి ప్రధాని అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ సోషల్ మీడియా పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.

అయితే రామ్ చరణ్‌ పెద్ది సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే.. అప్పుడప్పుడు పలు ఈవెంట్లకు వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పెద్ది చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత సుకుమార్ తో చేసే సినిమా ఫస్ట్ షెడ్యూల్ 2026 ఫిబ్రవరిలో మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News