సైనికుల్లా పోరాడుదాం.. సక్సెస్ ఫుల్ మూవీ చేస్తే ఎంతో గర్వంగా!: చరణ్
తాను స్కూల్ చదువుకున్న వయసులో ఉన్నప్పుడు అవగాహన కార్యక్రమాలకు తమ పాఠశాల తరపున వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు.;
డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. శిల్పకళా వేదికలో గురువారం జరిగిన ఆ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో విజయ్ దేవరకొండతో కలిసి అవగాహన కల్పించారు.
ఆ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడారు. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలకు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ లు కొనివ్వాలంటే భయపడే పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక తండ్రిగా రాష్ట్రం గురించి, సిటీ గురించి, స్కూల్స్ గురించి ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. పిల్లలను బయటకు పంపించాలంటే ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుందని తెలిపారు.
వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సహకరించాలని రామ్ చరణ్ అందరినీ కోరారు. రైజింగ్ తెలంగాణ అభివృద్ధి మనం ఎల్లప్పుడూ భాగం అవుతామని పిలుపునిచ్చారు. మన కుటుంబాన్ని, మన పాఠశాలను, మన స్నేహితులను మనమంతా కాపాడుకోవాలని అన్నారు. భవిష్యత్తును కాపాడుకుందామని చెప్పారు.
తాను స్కూల్ చదువుకున్న వయసులో ఉన్నప్పుడు అవగాహన కార్యక్రమాలకు తమ పాఠశాల తరపున వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కొన్ని స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి బాధేసిందని పేర్కొన్నారు.
అయితే అప్పుడు తాను తండ్రిని కాదని, ఇప్పుడు తాను కూడా ఒక తండ్రిని అన్నారు. తాను విజయవంతమైన మూవీ చేసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుందని వెల్లడించారు. ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే గొప్పగా ఉంటుందని తెలిపారు. సాయంత్రం స్నేహితులతో క్రీడలు ఆడడం వల్ల ఎంతో ఉత్సాహంగా ఉంటుందన్నారు.
అందుకే రోజూ వ్యాయామం చేస్తూ నచ్చిన పని చేసుకుంటూ, కుటుంబంతో హ్యాపీగా ఉండండని పిలుపునిచ్చారు. అందుకే మన ఫ్యామిలీతో మొదలు పెట్టి స్కూల్, సమాజం బాగుచేసుకుందామని చరణ్ అన్నారు. అయితే ఆ విషయంలో పోలీస్ శాఖ కృషిని ప్రశంసిస్తున్ననట్లు తెలిపారు. ఏదేమైనా ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదామని, డ్రగ్స్ ను నిర్మూలిద్దామని అన్నారు.