చరణ్ 'పెద్ది'.. నైజాంలో రేట్లు పెరగకపోవడం ప్లస్సేనా?
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ది సాధారణ ధరలతో విడుదల కావడం ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్, ఈవెంట్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు ముందు తెలంగాణలో టికెట్ ధరల పెంపు అంశం lఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తొలి వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి క్లియర్ రెస్పాన్స్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ విషయంలో తక్షణ జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొనడంతో, సాధారణ టికెట్ ధరలతోనే ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నైజాం మార్కెట్ లో పెద్ది వసూళ్లపై ప్రభావం ఎంతలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపు వంటి అవకాశాలు కల్పించడం ద్వారా భారీ వసూళ్లు నమోదవుతుంటాయి. ముఖ్యంగా హై బడ్జెట్ చిత్రాల విషయంలో నిర్మాతలు ఎక్స్ ట్రా ప్రాఫిట్స్ పై ఆశలు పెట్టుకోవడం సహజం. ఈ నేపథ్యంలో తెలంగాణలో అనుమతులు రాకపోవడం తొలుత మూవీ యూనిట్ కు ఎదురుదెబ్బగానే కనిపించింది.
అయితే ఇప్పుడు మరో అభిప్రాయం వినిపిస్తోంది. టికెట్ ధరలు పెరగకపోవడం వల్ల నార్మల్ ఆడియన్స్ కు సినిమా మరింత అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెద్ద సినిమాల టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంపై సినీ అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ది సాధారణ ధరలతో విడుదల కావడం ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, యంగ్ ఆడియన్స్, బీ-సీ సెంటర్ల ప్రేక్షకుల థియేటర్లకు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఒకవేళ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తే, సాధారణ ధరలు మరింత ప్లస్ గా మారే అవకాశం ఉంది.
సినిమా బాగుందనే టాక్ మొదలైతే మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ప్రేక్షకుల రద్దీ పెరిగే అవకాశముంది. రేట్లు అనుకూలంగా ఉండడంతో పలుమార్లు సినిమా చూడాలనుకునే అభిమానులు వెనుకాడకపోవచ్చు. దీంతో ఒక్కో టికెట్ పై అదనపు ఆదాయం లేకపోయినా, ఎక్కువ మంది ప్రేక్షకులు రావడం ద్వారా ఆ లోటు కాస్త భర్తీ అయ్యే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఓటీటీ ఎఫెక్ట్ తో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందనే అభిప్రాయం ఉంది. అలాంటి సమయంలో అందుబాటు ధరల్లో పెద్ద సినిమా విడుదల కావడం థియేటర్లకు కూడా ప్లస్ గా మారుతుంది. మంచి కంటెంట్ తో పాటు పాజిటివ్ మౌత్ టాక్ కలిస్తే, పెద్దికి లాంగ్ రన్ దక్కే అవకాశాలు పెరుగుతాయి. ఏదేమైనా ఇప్పుడు టికెట్ ధరల పెంపు లేకపోవడం నిర్మాతల దృష్టిలో తొలి చూపులో మైనస్ గా కనిపించినా, ప్రేక్షకుల పరంగా చూస్తే అది ప్లస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.