'పెద్ది' ఈవెంట్స్: 'ఫ్లో'లో మాట జారితే ఎందుకింత రాద్ధాంతం?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమా `పెద్ది`ని పీక్స్ లో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమా `పెద్ది`ని పీక్స్ లో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాదిలో కీలక నగరాలన్నిటినీ చుట్టేసారు. మొన్న భోపాల్ (మధ్యప్రదేశ్), నిన్న విజయవాడ (ఆంధ్రప్రదేశ్) ఈవెంట్లలో అతడి ఈవెంట్ కి ఊక వేస్తే రాలనంతమంది ఫ్యాన్స్ పోటెత్తారు. అయితే ఇంత పెద్ద ఈవెంట్లలో చరణ్ చాలా అరుదుగా, పొరపాటున నోరు జారినందుకు ట్రోలర్స్ యథావిథిగా విమర్శించడం మొదలు పెట్టారు.
రామ్ చరణ్ ఇప్పటికే రెండుసార్లు తన మాట జారారు. అయితే అది కావాలని చేసినదా? `పెద్ది` సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో ఎంతో ఎమోషనల్ అవుతున్న చరణ్ ఫ్లోలో మాట్లాడేప్పుడు పొరపాటున మాట జారారని అందరికీ లైవ్ గా చూస్తున్నవారికి అర్థమవుతూనే ఉంది. అయినా ట్రోలర్లు మాత్రం తమ పని మానలేదు.. చరణ్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ఇంతకుముందు భోపాల్ ఈవెంట్లో టీమిండియా ఫేసర్ బుమ్రా గురించి మాట్లాడుతూ పొరపాటున `ఫుట్ బాల్ ఆటగాడు` అని అన్నారు. అతడికి అభిమానిని అని చెబుతూనే ఆయన ఈ మాట అనడం బుమ్రా అభిమానుల హృదయాలను గాయపరిచిన మాట వాస్తవమే అయినా.. అక్కడ సందర్భం ఏమిటి? ఎందుకు రామ్ చరణ్ తడబడ్డారు? అన్నది కూడా గమనించడం చాలా ముఖ్యం. మధ్యప్రదేశ్ లాంటి చోట్ల తన ప్రాంతానికి సంబంధం లేని మనుషుల మధ్య అంతమందిని చూసి ఎంతో ఎమోషనల్ అయిపోయిన చరణ్ పొరపాటున ఒకసారి `బీహార్ వాసులు` అనేసారు.. మరోసారి `బుమ్రా ఫుట్ బాల్ ఆటగాడు`! అంటూ నోరు జారడంతో చాలా రాద్ధాంతమే చేసారు ట్రోలర్లు. అయినదానికి కానిదానికి ట్రోలింగ్ చేస్తూ వినోదం పొందడం ఈ డిజిటల్ యుగంలో నిత్యం చూస్తున్నదే అయినా అక్కడ సమయం సందర్భం ఎందుకు పొరపాటు జరిగిందో కొంచెం కూడా ట్రోలర్లు పట్టించుకోలేదు. భారీ జనసందోహం మధ్య జనం చాలా ఎగ్జయిట్ అయి, ఎమోషనల్ గా మాట్లాడేప్పుడు దొర్లిన పొరపాటు అది.
ఇప్పుడు `పెద్ది` విజయవాడ ఈవెంట్లోను చరణ్ పొరపాటున మాట జారారు. తన `పెద్ది` నిర్మాత సతీష్ కిలారు సెట్లో మూడు షిఫ్టులు తమతో పాటే ఉండి ఎలా హార్డ్ వర్క్ చేసారో చరణ్ తన మాటల్లో చెప్పారు.. ``సెట్ కి వచ్చి ఇలా టీ తాగి అలా వెళ్లిపోయే నిర్మాతలనే చూసాన``ని.. సతీష్ అలాంటి నిర్మాత కాదని కాంప్లిమెంట్ ఇచ్చిన చరణ్ ఫ్లోలో మాట్లాడేప్పుడు నిర్మాతనుద్ధేశించి మాట్లాడుతూ `వెన్నుపోటు` అంటూ పదం జారారు. ఆ తర్వాత పెద్ది టీమ్ కు `వెన్నెముక`గా నిలిచారని సరి చేసుకున్నారు. అయితే చరణ్ పొరపాటున నోరు జారినా దానిని హెడ్ లైన్స్ లో పెట్టి కొన్ని యూట్యూబ్ మీడియాలు లేదా అసంఘటిత మీడియాలు దానినే హైలైట్ చేయాలనుకోవడం వింతైన మానసిక స్థితికి అద్దంపడుతోంది. ఇక తన నిర్మాత సతీష్ కిలారు మొదటి సినిమాలా కాకుండా 50 సినిమాల నిర్మాతలా పని చేసారని కూడా చరణ్ కితాబిచ్చారు.
ఈ రెండు సందర్భాలలో చాలా మంది చరణ్ అప్పటి పరిస్థితిని.. ఆ సమయంలో ఆ సెటప్‌లో పొరపాటున ఒక మాట జారడం.. అది కావాలని జరగలేదని కూడా గమనించారు. అయినా ట్రోలర్లు మారడం లేదు. దీనిని ఒక నేషనల్ ఇష్యూలా మార్చేస్తున్నారు. నిజానికి డిజిటల్ యుగంలో ట్రోలింగ్ కల్చర్ ని పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం తమ యూట్యూబ్ మీడియాలను ప్రమోట్ చేసుకునేందుకు `క్లిక్ బైట్` పోరాటంగానే దీనిని పరిగణిస్తున్నారు! ఇలాంటి క్లిక్ బైట్ ల కారణంగా `పెద్ది`కి ఒక రకంగా భారీ ప్రమోషన్ దక్కుతుండడం ఒక రకంగా పెద్ద ప్లస్!