పెద్ది 9 రోజుల లెక్కలు.. నెం.1 ప్లేస్ కొట్టేసిందిగా!

మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, పెద్ది ప్రపంచవ్యాప్తంగా తొలి తొమ్మిది రోజుల్లో రూ.366 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

Update: 2026-06-13 10:24 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ది మూవీ గురించి చర్చ సాగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఆ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా తొమ్మిది రోజుల కలెక్షన్లు ప్రకటించిన మేకర్స్.. పెద్ది 2026లో సౌత్ లోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచిందని వెల్లడించారు.

మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, పెద్ది ప్రపంచవ్యాప్తంగా తొలి తొమ్మిది రోజుల్లో రూ.366 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది సౌత్ ఇండియాలో విడుదలైన చిత్రాల్లో ఇదే అత్యధిక గ్రాస్ అని మేకర్స్ పేర్కొన్నారు. దీంతో 2026లో నంబర్-1 గ్రాసర్‌ గా పెద్ది నిలిచినట్లు ప్రకటించారు. విడుదలై ఇంకా రెండు వారాలు పూర్తికాకముందే ఆ రేంజ్ వసూళ్లు నమోదు చేయడం విశేషం.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్స్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ.. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో దర్శకుడు బుచ్చిబాబు ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తన గుర్తింపు కోసం పోరాడే ఓ యువ క్రీడాకారుడి ప్రయాణాన్ని హర్ట్ కు టచ్ అయ్యేలా తీశారు. కథలోని ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో కలిసి థియేటర్లకు వస్తుండటం మూవీ సక్సెస్ కు ప్లస్ పాయింట్ గా మారింది.

సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. పాత్ర కోసం ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ పై క్లియర్ గా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సాధారణ యువకుడి నుంచి క్రీడాకారుడిగా ఎదిగే పాత్రలో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ అభిమానులను మెప్పిస్తోంది. చరణ్ కెరీర్‌ లో ఇది గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచింది.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథనాన్ని మరింత స్ట్రాంగ్ గా నిలబెట్టడంలో సంగీతం కీలక పాత్ర పోషించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పెద్ది భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఇప్పటికే రూ.50 కోట్ల మార్క్‌ ను చేరుకున్నట్లు వినికిడి.

నార్త్, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమా స్టేబుల్ వసూళ్లు నమోదు చేస్తోంది. పెద్ద సినిమాల నుంచి పోటీ లేకపోవడం కూడా పెద్ది చిత్రానికి కలిసి వచ్చిన అంశంగా మారింది. ఇక ప్రస్తుతం అందరి దృష్టి రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్‌ పైనే ఉంది. ఇప్పుడు వీకెండ్ కావడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. బుకింగ్స్ కూడా పాజిటివ్ గానే ఉండడంతో త్వరలోనే పెద్ది రూ.400 కోట్ల మైల్ స్టోన్ ను అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News