పుష్ప2 ఫార్ములానే ఫాలో అవుతున్న పెద్ది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే మల్టీస్పోర్ట్స్ డ్రామాగా భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం నిర్మాతలు చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో నిర్వహించనున్న పెద్ది మ్యూజికల్ నైట్ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాకు జరగబోయే అతి పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఒకటిగా నిలవనుందని సమాచారం.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ సింగపూర్ ఈవెంట్ తరహాలోనే, భారీ స్థాయిలో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏంటంటే, కేవలం ఒక ప్రమోషనల్ కార్యక్రమం కోసం నిర్మాతలు దాదాపు రూ.2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
సాధారణంగా హైదరాబాద్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు భారీ స్థాయిలో స్పాన్సర్‌షిప్‌లు వస్తుంటాయి. అందువల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తక్కువగానే ఉంటుంది. కానీ పెద్ది విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. భోపాల్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక మ్యూజికల్ గాలా కోసం దాదాపు మొత్తం ఖర్చునే నిర్మాతలు భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే మొత్తంతో మరో భారీ సాంగ్‌ను హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ పై తెరకెక్కించవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం ఈ ఖర్చును ఒక లాంగ్‌టర్మ్ మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నారని సమాచారం.
ముఖ్యంగా నార్త్‌లో పెద్ది సినిమాపై భారీ హైప్ తీసుకురావడమే ఈ ఈవెంట్ మెయిన్ టార్గెట్ గా తెలుస్తోంది. ఈ మ్యూజికల్ నైట్‌కు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మెయిన్ ఎట్రాక్షన్ కానున్నారు. ఈవెంట్‌లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు, తన టీమ్ తో కలిసి సినిమాలోని నాలుగు పాటలను డైరెక్ట్ గా పెర్ఫార్మ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. నార్త్ ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా స్పెషల్ గా ఈ షోను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా మార్కెట్‌లో ఇప్పుడు నార్త్ ఇండియా కలెక్షన్లు ఎంత కీలకమో రీసెంట్ గా వచ్చిన సినిమాల ఫలితాలు స్పష్టంగా చూపించాయి. ముఖ్యంగా పుష్ప2: ది రూల్ హిందీ బెల్ట్‌లోనే దాదాపు రూ.800 కోట్ల వరకు వసూళ్లు సాధించగా, మొదటి భాగమైన పుష్ప: ది రైజ్ కూడా నార్త్ లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పెద్ది విషయంలో కూడా నిర్మాతలు అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఉత్తరాది మార్కెట్‌ను బలంగా టార్గెట్ చేస్తూ ముందుగానే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేపడుతున్నారు. రామ్ చరణ్ కు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తర్వాత దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఈ మ్యూజికల్ నైట్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పెద్ది జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.