చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాపై తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన వ్యాఖ్యలు మరింత హైప్ తీసుకొచ్చాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ గురించి ఆయన వెల్లడించిన విశేషాలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.
రత్నవేలు మాట్లాడుతూ, పెద్దిలో రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్ ను ప్రేక్షకులు చూస్తారని అన్నారు. రంగస్థలంలో చిట్టిబాబుగా ఎలా పూర్తిగా మలుచుకున్నారో, ఈ సినిమాలో కూడా పెద్ది పాత్రలో పూర్తిగా లీనమయ్యారని చెప్పారు. అయితే చిట్టి బాబు, పెద్ది పాత్రలు ఎమోషన్స్ పరంగా పూర్తిగా సెపరేట్ అని స్పష్టం చేశారు. సినిమాలో చరణ్ మరో స్థాయిలో నటించారని, ఒక షాట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలిపారు.
"చరణ్ ప్రతి సన్నివేశంలో ఇంకా బెటర్ రావాలని ప్రయత్నిస్తారు. ఓకే అయిన షాట్ కు మళ్లీ కొత్తగా చేయాలనుకునే ఆలోచన ఆయనలో ఉంటుంది. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా అద్భుతం" అంటూ రత్నవేలు ప్రశంసలు కురిపించారు. దీంతో పెద్దిలో చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
అంతేకాదు.. సినిమా విజువల్స్ గురించి కూడా రత్నవేలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పెద్ది కథ దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరం ప్రాంతంలో జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయినా, అప్పటి వాతావరణాన్ని నేచరుల్ గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. ప్రేక్షకులను ఆ కాలానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వరల్డ్ బిల్డింగ్ పై భారీగా వర్క్ చేసినట్లు వెల్లడించారు.
క్లాక్ టవర్, పాత వీధులు, షుగర్ ఫ్యాక్టరీ, కొండ ప్రాంతాలు, అక్కడి ప్రజల లైఫ్ స్టైల్ ఇలా ప్రతి అంశాన్ని ఎంతో నేచురల్ గా డిజైన్ చేశామని అన్నారు. కేవలం సెట్లు నిర్మించడం కాకుండా, ఆ కాలం నాటి ఫీలింగ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించేలా ప్రయత్నించామని చెప్పారు. కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ ఆధారంగా విజువల్ టోన్‌ను ఫైనల్ చేసినట్లు తెలిపారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలో స్పోర్ట్స్‌తో పాటు ఎమోషన్స్ కు కూడా పెద్దపీట వేసినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ప్రోమోలు, సాంగ్స్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రంగస్థలం తర్వాత మరోసారి పూర్తి స్థాయి రస్టిక్ అవతారంలో చరణ్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రత్నవేలు చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. ఏదేమైనా చరణ్ నటన, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్, రత్నవేలు విజువల్స్ కలిసి పెద్దిని మరో స్థాయికి తీసుకెళ్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.