ప్రపంచం మరోలా అర్థం చేసుకుంది.. రకుల్‌కి భర్త సారీ!
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ వివాహం గురించి తెలిసిందే.;
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ వివాహం గురించి తెలిసిందే. హిందీ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని రకుల్ పెళ్లాడారు. ఈ జంట అన్యోన్యత నవదంపతులకు ఆదర్శం. అయితే రకుల్ భర్త జాకీ భగ్నానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట మధ్య జరిగిన ఒక చిన్న సరదా సంభాషణ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ తమ వైవాహిక బంధాన్ని ఉద్దేశించి `సిట్యుయేషన్‌షిప్` అనే పదాన్ని వాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. పెళ్లయిన తర్వాత కూడా ఇలాంటి పదాన్ని వాడటం ఏమిటని కొందరు విమర్శలు గుప్పించడంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వివాదంపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. తన భర్త చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసారు. అందులో తన భర్తను ఆటపట్టిస్తూ.. ``మనం మిలీనియల్స్ ( అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అనవసరంగా జెన్-జీ లాగా కనిపించడానికి ప్రయత్నించకు`` అంటూ సరదాగా క్లాస్ తీసుకున్నారు. జాకీ వాడిన పదం కేవలం జోక్ మాత్రమేనని.. కానీ ప్రపంచం దానిని మరోలా అర్థం చేసుకుందని రకుల్ క్లారిటీ ఇచ్చారు.
రకుల్ చేసిన వ్యాఖ్యలకు జాకీ భగ్నానీ కూడా వెంటనే స్పందించారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన వీడియోలో అతడు తన చెవులు పట్టుకుని.. నవ్వులు చిందిస్తూ తన భార్యకు క్షమాపణలు చెప్పారు. తాను ఆ పదాన్ని సీరియస్‌గా చెప్పలేదని.. సరదాగా అన్న మాట అంత వివాదం అవుతుందని ఊహించలేదని భగ్నానీ పేర్కొన్నారు. కేవలం ఒక గంట పాటు జరిగిన సంభాషణల నుంచి ఒకే ఒక లైన్‌ను తీసుకుని హెడ్ లైన్స్‌గా మార్చడంపై రకుల్ కూడా అసహనం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే క్లిక్‌బైట్ వార్తలపై రకుల్ ఘాటుగానే స్పందించారు. సందర్భం అనేది చాలా ముఖ్యం. సంభాషణల సారాంశాన్ని పక్కన పెట్టి... కేవలం ఆకర్షణీయమైన మాటలను పట్టుకుని వార్తలు రాయడం సరికాదు. కనీసం ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలలో నెటిజనులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నాను! అని రాసారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న జోక్‌ను సీరియస్ ఇష్యూ చేయవద్దని రకుల్ పరోక్షంగా నెటిజన్లకు, మీడియాకు విన్నవించారు.
ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. రకుల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తదుపరి `పతి పత్ని ఔర్ వో 2` అనే చిత్రంలో నటించనున్నారు. మేలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ , వామికా గబ్బి తదితరులు నటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లను పక్కన పెట్టి..రకుల్ తన కెరీర్ -వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.