'ఐ బొమ్మ' రవి అరెస్టు వేళ.. భారీగా ఆ మూవీ టికెట్ ధరల తగ్గింపు
ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ఒకటైన ‘ఈటీవీ విన్’ రూపొందించిన ఈ మూవీకి నిర్మాతలుగా బన్నీ వాసు.. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ‘‘రాజు వెడ్స్ రాంబాయి’’.;
‘ఐ బొమ్మ’ రవి అరెస్టు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పైరసీకి పాల్పడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమను భారీగా దెబ్బ తీస్తున్న అతడి అరెస్టుపై చిత్రపరిశ్రమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ.. పోలీసులకు థ్యాంక్స్ చెబుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నమైన స్పందనలు రావటం తెలిసిందే. ఐ బొమ్మ రవి అరెస్టు వేళ.. సినిమా టికెట్ ధరలు.. థియేటర్లలో తినుబండారాల ధరలపై చర్చ రాజుకుంది. ఇలాంటి వేళ.. సంచలన నిర్ణయాన్ని ప్రకటించిందో చిత్ర యూనిట్.
ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ఒకటైన ‘ఈటీవీ విన్’ రూపొందించిన ఈ మూవీకి నిర్మాతలుగా బన్నీ వాసు.. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ‘‘రాజు వెడ్స్ రాంబాయి’’. ఈ శుక్రవారం (నవంబరు 21) థియేటర్లలో విడులయ్యే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మూవీ టీం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి క్రిష్ణ మాట్లాడుతూ.. పైరసీపై ఈటీవీ విన్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.
తమ ప్లాట్ ఫామ్ మీద విడుదలైన ‘‘క’’ మూవీ పైరసీ కాకుండా అడ్డుకున్నామని.. అప్పుడు దాని గురించి చాలామంది మాట్లాడుకున్నారన్నారు అదే సమయంలో ఇప్పుడు ‘ఐ బొమ్మ’ రవి అరెస్టు గురించి కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని.. అతడ్ని పట్టుకున్న పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఈ సందర్భంగా మూవీ టికెట్ ధరలు పెరిగిపోయాయని.. అవి తగ్గితేనే థియేటర్లకు వస్తామనే మాటలు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. థియేటర్ లో పాప్ కార్న్.. వాటర్ బాటిల్ ధరలు పెరిగాయి. థియేటర్లకు వెళ్లి ఎందుకు చూడలని అంటున్నారు. అందుకే మా చిత్రాన్ని సింగిల్ థియేటర్లలో రూ.99కు.. మల్టీఫ్లెక్స్ ల్లో రూ.105కే చూపించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని వెల్లడించారు. అఖిల్ తేజస్విని జంటగా సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ మూవీ మీద అంచనాల కన్నా.. తాజా నిర్ణయం మీదనే ఎక్కువ చర్చ జరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.