రాజు వెడ్స్ రాంబాయి : నటుడి భార్య వద్దకి వెళ్లిన లవ్ లెటర్!
ఈ సినిమాలో ప్రముఖ నటుడు శివాజీ రాజా ముఖ్య పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సినిమాలో అనితా చౌదరి ముఖ్య పాత్రలో నటించారు.;
చిన్న చిత్రంగా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీగా విడుదలైన సినిమాలన్నింటిని పక్కకు పెట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈమధ్య కాలంలో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలతో పోల్చితే ఈ సినిమా బాక్సాఫీస్ మంచి ఫలితాన్ని రాబడుతోంది. పల్లెటూరి ప్రేమ కథను దర్శకుడు సాయిలు కంపాటి భలే చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ఇదే బెస్ట్ అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ మీట్‌లో పలువురు దర్శకులు, నటీనటులు ముఖ్య అతిథులుగా హాజరు కావడంతో అందరి దృష్టిని ఈ సినిమా మరోసారి ఆకర్షించింది.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా...
ఈ సినిమాలో ప్రముఖ నటుడు శివాజీ రాజా ముఖ్య పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సినిమాలో అనితా చౌదరి ముఖ్య పాత్రలో నటించారు. సక్సెస్ మీట్‌లో శివాజీ రాజా, అనితా చౌదరి స్టేజ్ ఎక్కి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అంతే కాకుండా దర్శకుడు సాయిలుతో తమ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో శివాజీ రాజా నవ్వులు పూయించారు. మురారి సినిమా సమయంలో దర్శకుడు కృష్ణవంశీ ఏదైనా ఒక ప్రేమ లేఖ రాయి అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఒక లవ్ లెటర్ రాసి అనిత కి ఇచ్చాను. ఆమె చదువుకుని తనే ఉంచుకోవాలి కదా... దాన్ని ఆమె సెట్స్‌లో అందరికి చూపించింది. నేను ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉంటే అప్పుడు నన్ను చూడ్డానికి వచ్చి, నా భార్యకు ఆ లవ్ లెటర్‌ను చూపించింది అంటూ అనిత గురించి శివాజీ రాజా మాట్లాడి నవ్వులు పూయించాడు.
శివాజీ రాజా వ్యాఖ్యలు..
శివాజీ రాజా సినిమా గురించి మాట్లాడుతూ... సంతోషంతో కడుపు నిండి పోతుంది, అఖిల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేంత హీరో అవుతాడు, వర్షం వచ్చినప్పుడు వచ్చే మట్టి వాసన వస్తుందే.. అలాంటి సినిమా ఇది. వేణు ఉడుగుల గారు ఒక వజ్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి సాయిలు రూపంలో అందించారు. సాయిలు ఎంత మంచి వ్యక్తి అంటే లేడీస్ వద్ద మాత్రమే కాకుండా నా వద్ద కూడా సీన్స్‌ను చెప్పేందుకు వచ్చి సిగ్గు పడుతూ ఉంటాడు. వెంకన్న పాత్రలో నటించిన నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని విలన్‌గా ఏలుతాడు అని అన్నాను... అన్నట్లుగానే ఇప్పుడు అతడికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లిన బన్నీ వాసు, వంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, వారు కూడా ఈ సినిమాకు హీరోలు అంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. ఇలాంటి గొప్ప సినిమాలో నటించడం అదృష్టం గా భావిస్తున్నాను అన్నాడు.
రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్ మీట్...
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో హీరోగా అఖిల్ నటించగా, హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి తేజస్వీ రావు నటించింది. ఈ సినిమాలో విలన్ వెంకన్న పాత్రలో చైతన్య జొన్నలగడ్డ నటించాడు. ఇతడు హీరో సిద్దు జొన్నలగడ్డ అన్న అని తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు చైతన్య గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇంతకు ముందు సినిమాల్లో కనిపించినా కూడా ఈ సినిమాతో చైతన్య యొక్క విశ్వరూపం చూపించాడు. తప్పకుండా ఈ సినిమా తర్వాత చైతన్య టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారబోతున్నాడు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ విన్ వారు నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల మరో నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన వెనక ఉండి ఈ సినిమాను నడిపించాడు. సినిమా భారీ విజయంలో ఆయన పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.