రాజ్ పాల్ యాదవ్ కేసు: స్టార్ల నుంచి పైసా కూడా అందలేదు!
రాజ్‌పాల్ యాదవ్ తరపు న్యాయవాదులు శిక్షను తగ్గించాలని లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.;
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అతడికి సంబంధించిన ఆర్థిక వివాదం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రాజ్‌పాల్ యాదవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'అతా పతా లాపతా' (2010) కోసం తీసుకున్న రూ. 5 కోట్ల అప్పు- వడ్డీతో కలిపి దాదాపు రూ. 9 కోట్లకు చేరింది. ఈ అప్పు చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడంతో ఢిల్లీ హైకోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
రాజ్‌పాల్ యాదవ్ తరపు న్యాయవాదులు శిక్షను తగ్గించాలని లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో కోర్టు షెడ్యూల్ ప్రకారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కోర్టు ఇదివరకే స్పష్టం చేసినట్లుగా.. అప్పు మొత్తం సెటిల్ చేస్తే తప్ప ఆయనకు పూర్తి ఉపశమనం లభించే అవకాశం లేదు. ఇప్పటికీ అతడికి బెయిల్ రాలేదు.
తాజాగా రాజ్ పాల్ వ్యవహారంపై సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో కలకలం రేపాయి. అతడికి ఈ కష్ట కాలంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి వారు సహాయం చేస్తారని వార్తలు వచ్చినా, రాజ్‌పాల్ సోదరుడు మాత్రం తమకు పైసా కూడా అందలేదని చెప్పినట్లు కేఆర్కే ఆరోపిస్తున్నారు. కేవలం సోనూ సూద్ మాత్రమే తమను ఆదుకుంటారని రాజ్‌పాల్ కుటుంబం నమ్ముతున్నట్లు అతడు పేర్కొన్నారు. మరోవైపు రాజ్‌పాల్ మేనేజర్ గోల్డీ మాత్రం చాలా మంది ఫోన్ చేసి పరామర్శించారని, సహాయం చేయడానికి ముందుకు వచ్చారని చెబుతున్నారు.
బాలీవుడ్ ప్రముఖులు రాజ్‌పాల్ యాదవ్‌కు నైతికంగా మద్దతు ఇస్తున్నా కానీ, రూ. 9 కోట్ల భారీ మొత్తాన్ని ఎవరైనా వ్యక్తిగతంగా చెల్లిస్తారా అనేది సందేహంగా మారింది. సోనూ సూద్ లేదా ఇతర నటులు నిజంగానే అంత పెద్ద మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా పలువురు అతడికి సహాయం చేసే దిశగా ఆలోచిస్తున్నారని కథనాలొచ్చాయి. కానీ చివరికి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి. ``ప్రకటనలు ఘనం.. సాయం శూన్యం!`` అన్న చందంగా రాజ్ పాల్ విషయంలో జరుగుతుందా? లేక నిజాయితీగా ముందుకు వస్తారా? అన్నది వేచి చూడాలి.
రాజ్ పాల్ నటించిన భూత్ బంగ్లా, వెల్ కం టు ది జంగిల్, గమసాన్, మిషన్ లైలా, వివాశ్ వంటి సినిమలు విడుదలకు రావాల్సి ఉంది.