విశాల్ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తానంటోన్న మంత్రి!

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో ఫిల్మ్ టెక్నాలజీ -సినిమాటోగ్రాఫ్ మంత్రిత్వ శాఖను రాజ్‌మోహన్‌కు కేటాయించడంపై నటుడు విశాల్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-05-30 12:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో ఫిల్మ్ టెక్నాలజీ -సినిమాటోగ్రాఫ్ మంత్రిత్వ శాఖను రాజ్‌మోహన్‌కు కేటాయించడంపై నటుడు విశాల్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉంటూ ఇక్కడి కష్టనష్టాలను క్షుణ్ణంగా తెలిసిన సీఎం విజయ్ స్వయంగా ఈ బాధ్యతలు చూసుకుంటే బాగుంటుందని, అనుభవం లేని వారికి ఈ పదవి ఇవ్వడం వల్ల పరిశ్రమ సమస్యల పరిష్కారంలో జాప్యం జరగొచ్చని విశాల్ సందేహం వ్య‌క్తం చేసారు. చిత్రనిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించాలంటే సరైన సంస్కరణలు తీసుకురాగల సత్తా ఉన్నవారు నాయకత్వం వహించాలని విశాల్ సూచించారు.

తాజాగా విశాల్ చేసిన విమర్శలపై మంత్రి రాజ్‌మోహన్ అత్యంత హుందాతనంతో కూడిన సమాధానాన్ని ఇచ్చారు. ఓ సినిమా వేడుకలో పాల్గొన్న ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తనపై విమర్శలు చేసినప్పటికీ విశాల్ నమ్మకాన్ని గెలుచుకోవడానికి తాను కష్టపడతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ పరిశ్రమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని, విశాల్‌కు తన గురించి పూర్తి అవగాహన లేకపోవచ్చు కానీ ఒక నటుడిగా ఆయన సినిమాలను తాను ఎంతగానో ఇష్టపడతానని మంత్రి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.

మరోవైపు తమిళ చిత్రసీమలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ముఖ్యమైన అంశం సీఎం విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న `జననాయగన్` విడుదల. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే థియేటర్లలోకి రావాల్సిన భారీ చిత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల - సెన్సార్ బోర్డు అనుమతులు ఆలస్యం కావడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా విడుదలపై వ‌స్తోన్న రకరకాల పుకార్లకు మంత్రి రాజ్‌మోహన్ వివరణ ఇచ్చారు.

`జననాయగన్` సినిమా విడుదలను నిలిపివేయడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు గానీ, కుట్రలు గానీ లేవని తేల్చి చెప్పారు. కేవలం సెన్సార్ బోర్డు నుంచి అధికారిక ధృవీకరణ పత్రం రావాల్సి ఉందని, అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. ఏ ఒక్క సినిమాను కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకోదని, నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం కొన్ని టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో జూన్ నెలలో సినిమా విడుదల కానున్నట్లు చూపిస్తున్నప్పటికీ మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏదేమైనా? తమిళ సినీ పరిశ్రమలోని అంతర్గత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ ఇటు కొత్త మంత్రిత్వ శాఖ, అటు అగ్ర హీరోల ప్రతిష్టాత్మక చిత్రాల విడుదలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం సవాలుతో కూడుకున్న విషయమే. కొత్త ప్రభుత్వ సారథ్యంలో కోలీవుడ్ ట్రేడ్ మార్కెట్ ఎలాంటి వృద్ధిని సాధిస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News