సీక్వెల్స్‌కు నో చెప్పిన రజనీ.. జైలర్2కి అందుకే ఓకే చెప్పారా?
ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు బాషా, పడయప్ప లాంటి ఐకానికి సినిమాలకు కూడా రజినీ సీక్వెల్స్ వద్దనుకున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్‌లలో జైలర్2 ఒకటి. సెప్టెంబర్ 4 రిలీజ్ టార్గెట్‌తో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాపై భారీ డిస్కషన్స్ జరగడానికి కారణం రజినీ కెరీర్ లో ఆయన ఆల్మోస్ట్ సీక్వెల్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి రజినీ ఇప్పుడు జైలర్2 కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు బాషా, పడయప్ప లాంటి ఐకానికి సినిమాలకు కూడా రజినీ సీక్వెల్స్ వద్దనుకున్నారు. అంతెందుకు బ్లాక్ బస్టర్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ వస్తే ఆ మ్యాజిక్ ను మళ్లీ క్రియేట్ చేయలేమని సున్నితంగానే రిజెక్ట్ చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు జైలర్2 రూపంలో మరోసారి సీక్వెల్ రిస్క్ తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
బీస్ట్ తర్వాత నెల్సన్ కెరీర్‌పై అందరూ అనుమానపడుతున్న టైమ్ లో సూపర్ స్టార్ అతన్ని నమ్మి జైలర్ కు ఓకే చెప్పారు. ఆ నమ్మకాన్ని నెల్సన్ కూడా నిలబెట్టుకోవడంతో, ఇప్పుడు జైలర్2 వరకు వీరి కాంబినేషన్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఈసారి కథ పూర్తిస్థాయి సీక్వెల్ గా కంటే, టైగర్ ముత్తువేల్ పాండియన్ గత జీవితాన్ని ఆవిష్కరించే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. అంటే ఇది పార్ట్ 1 కొనసాగింపుతో పాటు ప్రీక్వెల్ టచ్ కలిగిన కథనమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశం రజనీని ఒప్పించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఎస్జే సూర్య ఫుల్ లెంగ్త్ విలన్‌గా నటిస్తుండటం, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ క్యామియోలతో జైలర్2 కు ఇప్పటికే పాన్ ఇండియా బజ్ ఏర్పడింది. సెప్టెంబర్ 4 గురువారం రిలీజ్ ప్లాన్ చేయడం వెనుక కూడా స్పష్టమైన బిజినెస్ స్ట్రాటజీ కనిపిస్తోంది. తర్వాతి వారం వినాయక చవితి సెలవులు ఉండటంతో లాంగ్ వీకెండ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇండస్ట్రీలో మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. అదే రోబో 2.0 తర్వాత రజనీ మళ్లీ సీక్వెల్ రిస్క్ తీసుకోవడం. దీంతో జైలర్2 కూడా అదే తప్పును రిపీట్ చేస్తుందా? లేక కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అన్న చర్చ మొదలైంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సౌత్ ఇండస్ట్రీ మొత్తం సీక్వెల్స్ వైపు మొగ్గు చూపుతున్న తీరు గమనార్హం. బాహుబలి2, కెజిఎఫ్2, పుష్ప2 లాంటి సినిమాలు పాన్ ఇండియా మార్కెట్‌లో సీక్వెల్స్‌కు అపారమైన క్రేజ్ తీసుకువచ్చాయి. మొదటి భాగంతో ఏర్పడిన భావోద్వేగ అనుబంధాన్ని, భారీ ఫ్యాన్ బేస్‌ను కొనసాగించడానికి సీక్వెల్స్ ఇప్పుడు బలమైన కమర్షియల్ ఫార్ములాగా మారాయి. ఇదే ట్రెండ్‌ను రజనీ కూడా ఇప్పుడు తన స్టైల్‌లో పరీక్షించబోతున్నారు. ఈ నేపథ్యంలో జైలర్2 కేవలం మరో సీక్వెల్‌గా మిగులుతుందా? లేక రజనీ కెరీర్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్న ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.