ఇళయరాజా రహస్యాలు బయటపెట్టిన రజనీకాంత్.. ఏమన్నారంటే?
ఇండియన్ సినీ హిస్టరీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఇళయరాజాకి అత్యున్నత స్థానం ఉంటుంది.;
ఇండియన్ సినీ హిస్టరీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఇళయరాజాకి అత్యున్నత స్థానం ఉంటుంది. ఈయన తన మ్యూజిక్ ద్వారా ఎంతోమంది సంగీత ప్రియులను అలరించడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి ఇళయరాజా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఇళయరాజాను సత్కరించడానికి ఒక పెద్ద సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రెటీలతోపాటు ప్రముఖంగా కమల్ హాసన్, రజినీకాంత్, తమిళనాడు సీఎం స్టాలిన్ లు పాల్గొన్నారు.అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇళయరాజాతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగా రజినీకాంత్ కూడా ఇళయరాజాతో ఉన్న కొన్ని మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రజినీకాంత్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.."ఇళయరాజాతో నాకు ఎంతో మంచి బాండింగ్ ఉంది.ఆయన ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి హిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.కానీ ఇళయరాజా నాకంటే కమల్ హాసన్ సినిమాలకే మంచి మ్యూజిక్ అందించారు" అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇక రజినీకాంత్ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు. అయితే రజినీకాంత్ మాట్లాడుతుండగా ఇళయరాజా మధ్యలో మాట్లాడుతూ.. వాళ్ళ మధ్య ఉన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని గుర్తు చేశారు.
ఆరోజు మహేంద్రన్ ఇచ్చిన పార్టీలో జరిగిన సగం బీర్ బాటిల్ సంగతి చెప్పేయనా అంటూ రజినీకాంత్ వైపు చూడడంతో రజినీకాంత్ చెప్పేయండి అన్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేంద్రన్ ఇచ్చిన పార్టీలో సగం బీరు బాటిల్ తాగి తెల్లవారుజామున 3 గంటల వరకు డాన్స్ చేసాం అంటూ ఇళయరాజా చెప్పుకు వచ్చారు. ఇక ఇళయరాజా మాట్లాడుతుండగా రజినీకాంత్ మైక్ తీసుకుని..1980లో జానీ మూవీ షూటింగ్ జరుగుతుంది.ఆ సమయంలో మహేంద్రన్ నేను మందు కొడుతున్నాం. అలా మందు కొట్టేటప్పుడు ఇళయరాజాను కూడా పిలుద్దాం అని చెప్పడంతో నేను ఓకే అన్నాను. అలా అక్కడికి ఇళయరాజా వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన ఇళయరాజా సగం బీర్ బాటిల్ తాగి చెప్పిన మాటలు..ఇచ్చిన పర్ఫామెన్స్ ని నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే సగం బీర్ బాటిల్ తాగి ఆయన ఉదయం 3 గంటల వరకు డాన్స్ చేశారు.
అయితే అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో మహేంద్రన్ ఇళయరాజాని తన సినిమాకి మ్యూజిక్ అందించమని కోరారు. కానీ ఇళయరాజా మాత్రం ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఇండస్ట్రీలో ఉన్న ఇతర ముచ్చట్ల గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల గురించి గాసిప్ వార్తలు చెప్పడంతో నేను, మహేంద్రన్ ఇద్దరం షాక్ అయిపోయాం అంటూ రజినీకాంత్ ఇళయరాజా కి సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని ఆ కార్యక్రమంలో బయటపెట్టారు. రజినీకాంత్ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే ఈ విషయం రజినీకాంత్ లీక్ చేయడంతో చాలామంది జనాలు బయటికి గంభీరంగా, అహంకారిలా కనిపించే ఇళయరాజాలో ఇలాంటి ఫన్నీ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.