కోలీవుడ్ టాప్ మూవీస్.. కూలీ ప్లేస్ ఏది?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మించారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించగా.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మరో రోల్ లో నటించారు. ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్, శాండిల్ వుడ్ నటుడు ఉపేంద్ర, సత్యరాజ్, మహేంద్రన్ సహా పలువురు స్టార్ నటీనటులు సినిమాలో కనిపించారు. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
అయితే భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన కూలీ మూవీ రిలీజ్ అవ్వగా.. వాటిని అందుకోలేకపోయింది. కానీ అదిరిపోయే రీతిలో ఓపెనింగ్స్ సాధించింది. స్టార్ నటీనటులు ఉండడం, లోకేష్ ఫ్యాక్టర్.. తొలిరోజు వసూళ్ల విషయంలో దోహదం చేశాయి. ఆ తర్వాత వరుస సెలవుల వల్ల సాలిడ్ కలెక్షన్స్ ను సాధించింది కూలీ.
ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి వారంలో రూ.430 కోట్లకు పైగా రాబట్టింది.ఏడు రోజుల్లోనే కమల్ హాసన్ విక్రమ్ మూవీ లైఫ్ టైమ్ వసూళ్లను అధగమించింది. ఆ సినిమాను కూడా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా.. రూ.420కుపైగా కోట్ల కలెక్షన్స్ ను అప్పట్లో సాధించింది.
ఇప్పుడు ఆ సినిమాను కూలీ డామినేట్ చేసింది. అదే సమయంలో కోలీవుడ్ లో టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో విక్రమ్ మూవీని వెనక్కి నెట్టి ఆరో స్థానంలో నిలిచింది. కాగా, ఆ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో రోబో 2.0, లియో, జైలర్, పొన్నియన్ సెల్వన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాలు ఉండగా, ఇప్పుడు కూలీ వాటి పక్కన చేరింది.
మరో విషయమేమిటంటే.. ఇప్పటి వరకు తమిళ చిత్రసీమలో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన ఆరు సినిమాల్లో మూడు మూవీలు రజినీకాంత్ వే కావడం గమనార్హం. తలైవా నటించిన 2.0 మూవీ టాప్ లో ఉండగా.. జైలర్ మూవీ మూడో స్థానంలో ఉంది. ఆ సినిమాతోనే రజినీ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూలీ సినిమా ఆరో స్థానంలో నిలవగా, మరి ఫుల్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధించి ఏ ప్లేస్ కు వెళ్తుందో చూడాలి.