ఆర్ఎఫ్ సీ కీటకం ప్రచారంపై గుట్టు విప్పిన నటుడు!
రెబల్ రామోజీ ఫిలిం సిటీలో `ఫౌజీ` సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.
రెబల్ రామోజీ ఫిలిం సిటీలో `ఫౌజీ` సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఫిలిం సిటీలో ఏదో విషపూరితమైన పురుగు కుట్టడం వల్లే ఆసుపత్రి పాలయ్యారని ఆమధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో రామోజీ ఫిలిం సిటీ వాతావరణం అంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. ఆ ప్రదేశంలో విషపూరిత కీటకాలున్నాయిని...అక్కడ షూటింగ్ ప్రమాదకరం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పాటు రాజేష్ శర్మ సన్నిహితురాలు, నటి సుదీప ఛటర్జీ ఇన్స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ కూడా చేశారు.
ప్రభాస్ సినిమా షూటింగ్ ప్యాకప్ తర్వాత రామోజీ ఫిలిం సిటీలోని చెట్లు, పొదలు ఉన్న ప్రాంతంలో టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా రాజేష్ శర్మను విషపూరితమైన సాలీడు కుట్టిందని ఆ తర్వాత విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో కోల్‌కతాలోని మణిపాల్ ఆస్పత్రి ఐసీయూలో చేర్చారని అందులో పేర్కొన్నారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో ఆర్ ఎఫ్ సీలో షూటింగ్ అంటే భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పరిస్థితులు చక్కబడ్డాయి.
తాజాగా ఈ మొతం వ్యవహౄరంపై రాజేష్ శర్మ స్పందించారు. అసలేం జరిగిందో నిజాలను వెల్లడించారు. తాను ఆసుపత్రిలో చేరడానికి క్రిమి కాటు కారణం కాదని.. మధుమేహం వ్యాధి తీవ్రత పెరగడమే కారణమన్నారు.
ప్రభాస్ సినిమా సెట్‌లో ఎలాంటి ప్రమాదం ..కీటకం కుట్టే ఘటన జరగలేదు. దీనికి ప్రభాస్ కానీ, చిత్ర యూనిట్ కానీ ఎంతమాత్రం బాధ్యులు కారు. వాళ్లంతా చాలా మంచివారు. నేను హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్నంతవరకు నాకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. చిత్ర యూనిట్‌కు సంబంధం లేని అంశాన్ని వారిపై తోయడం సరికాదని పేర్కొన్నారు.
తన కుడి కాలికీ చాలా కాలంగా చర్మ సమస్య ఉందన్నారు. హైదరాబాద్ షూటింగ్ పూర్తి చేసుకుని కోల్‌కతా వెళ్లిన తర్వాత రెండు రోజుల్లో పరిస్థితి విషమించిందన్నారు. `నాకు డయాబెటిస్ చాలా ఎక్కువగా ఉంది. మొదట్లో నేను దానిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కాలికీ ఉన్న ఇన్ఫెక్షన్ తీవ్రతరమైంది` అని రాజేష్ శర్మ వెల్లడించారు. తన ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటమే సమస్యకు కారణమన్నారు. సుదీప ఛటర్జీ తనకు మంచి మిత్రురాలని... ఆందోళనతోనే ఆమె ఆ పోస్ట్ చేసిందని అయితే ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఆమె అలా పోస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు.
ఆ తర్వాత ఆ విషయాలు నిజం కాదని తెలుసుకుని ఆమె ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించారని రాజేష్ శర్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు చికిత్స పూర్తయిందని.. కోలుకునే ప్రక్రియ వేగంగా జరుగుతోందని రాజేష్ శర్మ అభిమానులకు ఊరటనిచ్చే వార్త అందించారు. మరో వారం రోజుల్లో మళ్లీ సాధారణ స్థితికి వచ్చి షూటింగ్‌లలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత రాజేశ్ విశ్రాంతికే పరిమితమయ్యారు. కోలుకున్న అనంతరం తిరిగి `పౌజీ` షూటింగ్ లో జాయిన్ అవుతారు.