చంద్రుడిపైనే కాదు అంగారకుడిపైనా 'వారణాసి' రిలీజ్?

రాజమౌళి అంతటి దిగ్గజ దర్శకుడు సరదాగా వ్యాఖ్యానించినా కానీ.. భవిష్యత్తులో ఇది నిజం అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు. ఇప్పటికే మనుషులు చంద్రుడిపైకి అడుగుపెట్టారు.

Update: 2026-10-02 06:09 GMT

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `వారణాసి` పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని మొదట చంద్రుడిపై రిలీజ్ చేస్తానని సరదాగా, ఉత్సాహంగా వ్యాఖ్యానించారు.

దర్శకుడు రాజమౌళి తన సినిమాల ప్రమోషన్స్ - గ్రాండ్ రిలీజ్‌ల విషయంలో ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే `వారణాసి` సినిమా స్థాయిని.. దానిపై ఉన్న అంచనాలను హైలైట్ చేస్తూ ఆయన ఈ రకమైన సరదా వ్యాఖ్యలు చేశారు. త‌న‌యుడు కార్తికేయ డెబ్యూ నిర్మాత‌గా తెర‌కెక్కించిన `డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్` సినిమా ప్రచార కార్యక్రమాలలో ఈ విధంగా వ్యాఖ్యానించారు.

రాజమౌళి అంతటి దిగ్గజ దర్శకుడు సరదాగా వ్యాఖ్యానించినా కానీ.. భవిష్యత్తులో ఇది నిజం అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు. ఇప్పటికే మనుషులు చంద్రుడిపైకి అడుగుపెట్టారు. అక్కడ జీవనం సాగించడానికి అనువైన పరిస్థితులను అన్వేషిస్తున్నారు. చంద్రుడిపై స్థలాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో మనుషులు తరలి వెళితే అక్క‌డా థియేటర్లు, వినోదం కూడా అవసరమే. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడు కూడా మానవ ఆవాసాలుగా మారితే జక్కన్న తన పాన్ విశ్వం (యూనివ‌ర్శ్) వెంచర్లు కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది.

భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాలు ఏర్పరచుకోవడం.. అక్కడ శాశ్వత వసతులు కల్పించడంపై శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను కనుగొనడం.. సౌరశక్తిని వినియోగించుకోవడం ద్వారా అక్కడ కాలనీలను ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా స్పేస్ ఏజెన్సీలు చంద్రుడిపై బేస్ క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇక అంగారక గ్రహం (మార్స్) విషయానికి వస్తే.. భూమికి అత్యంత అనుకూలమైన గ్రహంగా దీనిని చూస్తున్నారు. భవిష్యత్తులో మనుషులు అక్కడ నివసించేందుకు వీలుగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం, గ్రీన్‌హౌస్ వ్యవసాయం చేయడం వంటి సాంకేతికతలపై అంతరిక్ష పరిశోధనా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ పరిణామాలు గనుక సాకారమైతే భవిష్యత్తులో కేవలం భూమిపైనే కాకుండా వేరే గ్రహాలపై కూడా సినిమాల ప్రదర్శనలు జరిగే అద్భుతమైన రోజులు రావొచ్చు. స్పేస్ (అంత‌రిక్షం) నేప‌థ్యంలో సినిమాలు తీయ‌డంలోనే కాదు.. అక్క‌డా థియేట‌ర్లు నిర్మించి సినిమాల్ని ఆడించ‌డంలోను మ‌న‌వాళ్లు స‌త్తా చాటేందుకు ఇంకెంతో స‌మ‌యం వేచి చూడ‌కూడ‌ద‌ని ఆశిద్దాము.

Tags:    

Similar News