హీరోల్ని మార్చిన పూరి.. ఈసారి మాత్రం..
ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. లైగర్ భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచింది. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ కూడా పూరికి కావాల్సిన ఫలితం ఇవ్వలేదు.
పూరి జగన్నాథ్ సినిమాల్లో ఒకప్పుడు హీరోనే పెద్ద హైలెట్. రవితేజకు ఇడియట్‌తో వచ్చిన ఇమేజ్, మహేశ్ బాబుకు పోకిరి ఇచ్చిన మాస్ రేంజ్, రామ్ చరణ్‌ను చిరుతతో పరిచయం చేసిన విధానం.. ఇలా హీరో కెరీర్‌లో గుర్తుండిపోయే మార్పులు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. పూరి సినిమా అంటే హీరో మాట్లాడే విధానం నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు కొత్తగా కనిపించేది.
ఆ తర్వాత అల్లు అర్జున్‌తో దేశముదురు, ఎన్టీఆర్‌తో టెంపర్, రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ వరకు పూరి మార్క్ హీరో క్యారెక్టర్లు వచ్చాయి. కొన్ని సినిమాలు హీరోల కెరీర్‌లో మళ్లీ జోష్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా టెంపర్ తర్వాత ఎన్టీఆర్ తీసుకున్న సినిమాల సెలక్షన్ కూడా మారింది. ఇస్మార్ట్ శంకర్ సమయంలో రామ్‌కు మాస్ సెక్షన్‌లో కొత్త క్రేజ్ వచ్చింది.
ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. లైగర్ భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచింది. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ కూడా పూరికి కావాల్సిన ఫలితం ఇవ్వలేదు. వరుసగా రెండు సినిమాలు పని చేయకపోవడంతో ఇప్పుడు ఆయన కొత్త సినిమా మీద ఒత్తిడి ఎక్కువైంది. గతంలో పూరి బ్రాండ్ హీరోలకు బలం.. కానీ ఇప్పుడు హీరో బలాన్ని నమ్ముకునే టైమ్ లైన్ లోకి వచ్చాడు.
పూరి ఫ్యాన్స్ ఫోకస్ ఇప్పుడు విజయ్ సేతుపతి 'స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్' పైనే ఉంది. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలో కూడా సేతుపతికి మంచి గుర్తింపు ఉంది. మహారాజా తర్వాత కథల విషయంలో విజయ్ సేతుపతిపై నమ్మకం మరింత పెరిగింది. పాత్ర కోసం తన ఇమేజ్‌ను మార్చుకోవడంలో కూడా ఆయన వెనకాడరు. పూరి ఇటీవలే విజయ్ సేతుపతి కథల ఎంపికను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇక స్లమ్‌డాగ్ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పూరికి కావాల్సింది హీరోను కొత్తగా చూపించడంతో పాటు మరో ఛాలెంజ్ కూడా ఉంది. విజయ్ సేతుపతి సెలెక్ట్ చేసుకున్న కథల్లో అదే నమ్మకం ఉండేలా ఎట్రాక్ట్ చేయగలగాలి. ఒకప్పుడు పూరి పేరు హీరోకు బలం అయితే, ఈసారి విజయ్ సేతుపతి పేరు పూరి సినిమాకు ఎంత బలం అవుతుందన్నదే చూడాలి.
అలాగే ఈ కాంబినేషన్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించే విషయం మరొకటి ఉంది. పూరి సినిమాల్లో హీరో ఆయన స్టైల్‌లోకి మారడం మనం చూశాం. విజయ్ సేతుపతి మాత్రం దర్శకుడి ఫార్ములాలో పూర్తిగా కలిసిపోయే నటుడు కాదు. పాత్రకు ఏది అవసరమో అదే చేస్తారు. ఇద్దరి స్టైల్స్ కలిస్తే పూరి పాత మాస్ టెంప్లేట్ కంటే మరో రకం సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.