జక్కన్న పాత కథలు.. మళ్లీ బయటకు వస్తాయా?

సాధారణంగా ఒక దర్శకుడు హీరోకి ఒక కథ చెప్తారు, నచ్చకపోతే మరో కథ రాస్తారు. కానీ రాజమౌళి స్టైల్ వేరు.;

Update: 2025-12-10 03:55 GMT

ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రాజమౌళి పేరు మారుమోగిపోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన చేస్తున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అని, గ్లోబల్ అడ్వెంచర్ అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ విజువల్ ట్రైలర్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

ఈ ప్రాజెక్ట్ తో జక్కన్న మరోసారి ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి గతంలో ప్రభాస్ తో చేసిన ప్రయోగాల వైపు మళ్లింది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. చత్రపతి నుంచి బాహుబలి వరకు వీరి ప్రయాణం ఒక చరిత్ర. అయితే బాహుబలి సినిమా పట్టాలెక్కడానికి ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సాధారణంగా ఒక దర్శకుడు హీరోకి ఒక కథ చెప్తారు, నచ్చకపోతే మరో కథ రాస్తారు. కానీ రాజమౌళి స్టైల్ వేరు. ఆయన ఏకంగా ప్రభాస్ కోసం ఒకేసారి ఐదు కథలను సిద్ధం చేశారట. అవును, బాహుబలి సినిమాను ఒకే చేద్దాం అనుకున్నప్పుడు రాజమౌళి ప్రభాస్ కు ఏకంగా 5 డిఫరెంట్ స్టోరీ లైన్స్ వినిపించారట. అందులో బాహుబలి పీరియాడిక్ డ్రామాతో పాటు ఒక పవర్ ఫుల్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా ఉందని సమాచారం.

గతంలో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి స్వయంగా బాక్సింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇక ఐదు కథల్లో ప్రభాస్ బాహుబలి కథను ఎంచుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం ఇండియన్ సినిమా రేంజ్ ను మార్చేసింది. ప్రభాస్ కు కథల ఎంపికలో ఎంత పట్టు ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సినీ ప్రేమికుల్లో ఒక కొత్త సందేహం మొదలైంది. రాజమౌళి ఏదైనా కథను హీరో దగ్గరకు తీసుకెళ్లారంటే, ఆయనకు ఆ కథ మీద వంద శాతం నమ్మకం ఉంటేనే వెళ్తారు.

అంటే ప్రభాస్ కోసం సిద్ధం చేసిన మిగతా నాలుగు కథలు కూడా అద్భుతంగానే ఉండి ఉంటాయి కదా. ముఖ్యంగా ఆ బాక్సింగ్ కథను రాజమౌళి తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనే ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి భవిష్యత్తులో ఆ కథల దుమ్ము దులుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు, రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ తో మరో మూడేళ్లు బిజీ. కానీ వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రావాలని కోరుకోని వారు ఉండరు.

ఒకవేళ మళ్లీ జతకడితే, గతంలో పక్కన పెట్టిన ఆ బాక్సింగ్ స్క్రిప్ట్ ని గానీ, మిగిలిన కథలను గానీ బయటకు తీస్తారా? లేదా పూర్తిగా కొత్త కథతో వస్తారా? అనేది చూడాలి. రాజమౌళి మనసులో ఏముందో ఆయనకే తెలియాలి. ఏదేమైనా ప్రభాస్ కోసం జక్కన్న ఐదు కథలు రాశారంటేనే ఆశ్చర్యంగా ఉంది. బాహుబలి మిస్ అయ్యి ఉంటే, మనం మరో అద్భుతాన్ని చూసేవాళ్లం ఏమో. వారణాసి పూర్తయ్యాక రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ పాత స్క్రిప్ట్స్ కు మోక్షం కల్పిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News