వారణాసి తర్వాత.. రాజమౌళి చూపు ఎవరివైపు!
‘వారణాసి’ ఇంకా థియేటర్లలోకి రాలేదు కానీ రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎవరితో అనే టాక్ అప్పుడే మొదలైంది.
‘వారణాసి’ ఇంకా థియేటర్లలోకి రాలేదు కానీ రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎవరితో అనే టాక్ అప్పుడే మొదలైంది. ఆ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిందని రీసెంట్ గా రాజమౌళే చెప్పాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా పూర్తయింది. మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేస్తూనే ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనులను ఒకేసారి నడిపిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7 రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో, మహేష్ సినిమా ఎండింగ్ కి వస్తున్న కొద్దీ అందరి చూపు జక్కన్న తర్వాతి ప్రాజెక్ట్ మీదే పడుతోంది.
బాహుబలి 2.. 2017లో వస్తే, ఆర్ఆర్ఆర్ కోసం 2022 వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ‘వారణాసి’ 2027లో వస్తోంది. అంటే ఆయన నుంచి ఒక సినిమా రావడానికే నాలుగైదేళ్ల సమయం పడుతోంది. అందుకే తర్వాతి సినిమా ఏ హీరోతో అనేది చాలా కీలకం. ఒకసారి కాంబినేషన్ కుదిరితే ఆ హీరో కూడా కొన్నేళ్ల పాటు పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌కే కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ప్రతి హీరో అభిమాని మాత్రం తమ హీరోతో వర్క్ చేయాలనే కోరికతో ఉన్నారు.
ఇప్పటివరకు ఎన్టీఆర్, ప్రభాస్‌లతో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో మళ్ళీ రామ్ చరణ్‌తో పనిచేశాడు. ఇప్పుడు మహేష్‌తో ఫస్ట్ కాంబినేషన్. దీంతో తర్వాత మళ్లీ పాత హీరోల్లో ఒకరితో వెళ్తాడా లేక ఇప్పటివరకు తనతో సినిమా చేయని మరో స్టార్‌ను రంగంలోకి దించుతాడా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
మరోవైపు లిస్టులో ఉన్న అతిపెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’. అది తన జీవిత లక్ష్యం అని రాజమౌళి ఎన్నోసార్లు చెప్పాడు. ఒక దశలో దాదాపు పది భాగాల వరకు ప్లాన్ చేయవచ్చని కూడా అన్నాడు. తాను చేసే ప్రతి సినిమా చివరకు మహాభారతం తీయడానికి అనుభవాన్ని ఇచ్చే ఒక ప్రయోగం లాంటిదని గతంలో చెప్పడం విశేషం. ‘వరాణాసి’లోనే రామాయణానికి సంబంధించిన కీలక ఘట్టాన్ని తెరకెక్కించడంతో పౌరాణిక ప్రపంచానికి మరింత దగ్గరయ్యాడు.
అయితే ఇప్పుడే ‘వరాణాసి’ తర్వాత మహాభారతమే ఉంటుందని ఒక నిర్ణయానికి రాలేము. ప్రస్తుతం షూటింగ్‌లోనే ఇంకా 20 శాతం భాగం మిగిలి ఉంది. ఆ తర్వాత భారీ విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచవ్యాప్త ప్రమోషన్స్ లాంటి ఎన్నో పనులు ఉన్నాయి. ఇంత పెద్ద సినిమాను రిలీజ్ చేసే వరకు జక్కన్న మరో కథపై పెద్దగా ఆలోచించకపోవచ్చు.
ఇక అసలు సమాధానం ‘వరాణాసి’ రిలీజ్ తర్వాతే తెలిసే అవకాశం ఉంది. మరో స్టార్ హీరోతో కొత్త కథను మొదలుపెడతాడా లేక చాలా కాలం నుంచి చెబుతున్న మహాభారతం వైపు అడుగులు వేస్తాడా అన్నది అప్పుడే తేలుతుంది. ఇక అప్పటివరకు మాత్రం ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పేరు రాజమౌళి తర్వాతి లిస్టులో ఉండాలని ఆశించడంలో తప్పులేదు.