రాజమౌళి.. ఈసారి ఎంత గ్యాప్?

ఇక్కడే బాహుబలి 2 టైమ్‌లైన్ గుర్తుకొస్తోంది. ఆ సినిమా కూడా అదే నెలలో వచ్చింది. కానీ రాజమౌళి తన నెక్స్ట్ హీరోల విషయంలో ఎక్కువ కాలం సైలెంట్‌గా ఉండలేదు.

Update: 2026-09-03 02:45 GMT

రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందన్నది ఎప్పుడూ పెద్ద మిస్టరీనే. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి చేస్తున్నాడు. ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడే బాహుబలి 2 టైమ్‌లైన్ గుర్తుకొస్తోంది. ఆ సినిమా కూడా అదే నెలలో వచ్చింది. కానీ రాజమౌళి తన నెక్స్ట్ హీరోల విషయంలో ఎక్కువ కాలం సైలెంట్‌గా ఉండలేదు.

బాహుబలి 2 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. అదే ఏడాది నవంబర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఫొటోను రాజమౌళి బయటపెట్టాడు. అంటే దాదాపు 204 రోజుల్లోనే నెక్స్ట్ కాంబినేషన్‌పై మొదటి హింట్ వచ్చేసింది. కథ, టైటిల్ అప్పటికి బయటకు రాకపోయినా రాజమౌళి తర్వాత ఎవరితో వెళ్తున్నాడనే విషయం మాత్రం అర్థమైంది. ఇప్పుడు వారణాసి కూడా ఏప్రిల్‌లోనే వస్తుండటంతో ఈసారి ఆ గ్యాప్ ఎంత ఉంటుందనేది చూడాలి.

రాజమౌళికి ఇప్పుడు రెడీగా ఉన్న హీరోల ఆప్షన్స్ చూస్తే.. తెలుగులో ముందుగా అల్లు అర్జున్ పేరు కనిపిస్తుంది. రాజమౌళి ఇప్పటివరకు బన్నీతో సినిమా చేయలేదు. పైగా పుష్ప తర్వాత అతని మార్కెట్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది. రాజమౌళి సినిమా కోసం కావాల్సిన ఫిజికల్ వర్క్, లుక్ మార్పులు, ఎక్కువ రోజుల షూటింగ్ కూడా బన్నీ చేయగలడు. సమస్య మాత్రం డేట్స్. ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా లోకేష్ లాంటి వాళ్ళతో లైనప్ ఉంది.

బన్నీ వెంటనే అందుబాటులో లేకపోతే తెలుగు బయట యశ్ పేరు బాగా సరిపోతుంది. ఒక సినిమా కోసం ఎక్కువ సమయం పెట్టడం అతనికి కొత్త కాదు. కేజీఎఫ్ కోసం ఏళ్ల తరబడి ఒకే ప్రపంచంలో ఉండగలిగాడు. టాక్సిక్ కోసం కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. రాజమౌళి కూడా తన హీరో నుంచి అలాంటి కమిట్‌మెంట్‌నే కోరుకుంటాడు. పైగా యశ్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఈ కాంబినేషన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

ఇంకో ఆప్షన్‌గా సూర్య పేరు కొంతకాలంగా వినిపిస్తోంది. పాత్ర కోసం శరీరాన్ని మార్చుకోవడం నుంచి అవసరమైతే ఎక్కువ కాలం ఒక సినిమాకు కేటాయించడం వరకు సూర్యకు ఆ ట్రాక్ ఉంది. అందుకే రాజమౌళి పేరు పక్కన అతని పేరు వచ్చినప్పుడు పూర్తిగా అబద్ధంగా అనిపించలేదు. అయినా అది ఇప్పటివరకు రూమర్ మాత్రమే. ఇద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే ఈసారి హీరో ఎవరు అనేది పక్కన పెడితే రాజమౌళి టైమింగ్ మీద ఎక్కువ ఫోకస్ పడుతోంది. బాహుబలి 2 తర్వాత 204 రోజుల్లోనే నెక్స్ట్ కాంబినేషన్‌పై హింట్ ఇచ్చాడు. వారణాసి తర్వాత కూడా అంత కంటే ఎక్కువ టైమ్ తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. స్పీడ్ గా నిర్ణయం తీసుకుంటే 2027 ముగిసేలోపే కొత్త హీరో పేరు బయటకు రావచ్చు. మరి ఆప్షన్ లో ఉన్నవాళ్ళలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News