తమన్.. మళ్లీ డిజప్పాయింట్ చేశాడే

ఐతే మొన్న విడుదల చేసిన గ్లింప్స్ చూస్తేనే ఏదో తేడా కొట్టింది. నిన్న సాంగ్ చూశాక అనుమానాలే నిజం అయ్యాయి.;

Update: 2025-11-24 07:23 GMT

‘రాజాసాబ్’ సినిమా నుంచి తొలి పాట కోసం కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. మామూలుగా కొత్త సినిమాల ప్రమోషన్లను పాటలతోనే మొదలుపెడతారు. చివరగా ట్రైలర్ వస్తుంది. కానీ విచిత్రంగా.. విడుదలకు మూడున్నర నెలల ముందే ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ‘రాజా సాబ్’ టీం.. నిన్నటిదాకా పాట మాత్రం లాంచ్ చేయలేదు. ఫస్ట్ సింగిల్ గురించి కొన్ని నెలలుగా ఊరిస్తూ వచ్చిన టీం ఎట్టకేలకు నిన్న రాత్రి పాటను వదిలింది.

ఐతే మొన్న విడుదల చేసిన గ్లింప్స్ చూస్తేనే ఏదో తేడా కొట్టింది. నిన్న సాంగ్ చూశాక అనుమానాలే నిజం అయ్యాయి. రెబల్ సాబ్ అంటూ సాగిన తొలి పాట అంచనాలను అందుకోలేకపోయింది. ఇటు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ.. అటు తమన్, సంజిత్ హెగ్డేల గానం కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పాట అంతా గోల గోలగా అనిపించింది.

తమన్ అంటే లిరిక్స్‌ను మ్యూజిక్ డామినేట్ చేయడం కామన్. ఇందులో ఆ డామినేషన్ మరీ ఎక్కువైంది. అలా అని మ్యూజిక్ అయినా కొత్తగా, వినసొంపుగా ఉందా అంటే అదీ లేదు. విజువల్స్ మాత్రం ఓ మోస్తరుగా అనిపించాయి. ప్రభాస్ ‘మిర్చి’ రోజులను గుర్తు చేస్తూ హుషారుగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. దీనికి తోడు ‘పాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్’ అనే ట్యాగ్ వేసుకోవడం కూడా అభిమానులను ఎంటర్టైన్ చేసింది. వీటిని పక్కన పెడితే.. ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ నిరాశపరిచిన మాట వాస్తవం.

ఇటీవల తమన్ ఇలా డిజప్పాయింట్ చేయడం ‘రాజా సాబ్’ విషయంలో మాత్రమే జరగలేదు. ‘అఖండ-2’ పాటలు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. అందులోంచి కూడా చార్ట్ బస్టర్ సాంగ్ ఏదీ రాలేదు. తమన్ పాటలంటే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతాయనే పేరుండేది. కానీ ‘మన శంకర వరప్రసాద్’లో మీసాల పిల్లా.. ‘పెద్ది’ నుంచి ‘చికిరి చికిరి’ ఊపేస్తుండగా.. తమన్ ఇలా వరుసగా నిరాశాజనక పాటలు ఇస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Tags:    

Similar News