తెలుగు సినిమాలు ఒప్పుకున్నప్పుడు రాధిక ఆప్టేకు ఈ విషయం తెలియదా?
| ఈ అనుభవాలను ఇప్పుడు బయటపెడుతూ సినిమా పరిశ్రమలో పితృస్వామ్య ధోరణుల గురించి మాట్లాడింది.
హిందీ నటి రాధిక ఆప్టే మరోసారి తెలుగు సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ కీర్తి సురేష్తో కలిసి నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె మరోసారి సౌత్ సినిమాపై వ్యాఖ్యలు చేసింది.
రాధిక ఆప్టే ఒక తెలుగు సినిమాలో నటించినప్పుడు తన పాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు తనకు నచ్చలేదని చెప్పింది. ఆ సినిమాలో తన కజిన్ ని పెళ్లి చేసుకోవాల్సిన పాత్రలో నటించాల్సి వచ్చిందని వెల్లడించింది. అంతేకాకుండా తనకంటే చాలా పెద్ద వయసున్న హీరోతో నటించాల్సి వచ్చిందని, సినిమా మధ్యలోనే తన పాత్ర చనిపోతుందని తెలిపింది.
ఈ అనుభవాలను ఇప్పుడు బయటపెడుతూ సినిమా పరిశ్రమలో పితృస్వామ్య ధోరణుల గురించి మాట్లాడింది. ఆమె చెప్పిన దాంట్లో అందరికీ వస్తున్న ప్రశ్న ఏమిటి అంటే.. కథ విన్న తర్వాతే కదా ఈ హీరోయిన్ ఆ సినిమా ఒప్పుకొని ఉంటుంది.. మరి మళ్లీ ఆ పాత్ర గురించి ఆమె ఇంత నెగిటివ్గా మాట్లాడేసిన అవసరం ఏమిటి. సినిమా కథ, హీరో, తన పాత్ర గురించి ముందుగానే తెలుసుకోకుండా ఆమె ఆ సినిమాకు ఎలా అంగీకరించింది. కథ నచ్చకపోతే అప్పుడే ఆ సినిమా నుంచి తప్పుకునే అవకాశం లేదా. మరి సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలను ప్రస్తావించడం ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జాన్వీ కపూర్ కూడా తెలుగు దర్శకులు తనకు సరైన స్క్రిప్ట్ ఇవ్వలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె వ్యాఖ్యలకు కొంత భిన్నమైన నేపథ్యం ఉంది. కానీ రాధిక ఆప్టే మాత్రం తెలుగు సినిమాల గురించి మాట్లాడిన ప్రతిసారీ విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా తెలుగు సినిమాల్లో నటీనటుల ఎంపిక గురించి రాధిక వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమాల్లో తెల్లగా ఉండే హీరోయిన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పింది. అయితే ఆమె కూడా తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుని నటించింది.
సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య వయసు తేడా ఉండటం కొత్త విషయం కాదు. కథకు అనుగుణంగా అలాంటి పాత్రలు ఉంటాయి. వాటిని అంగీకరించాలా వద్దా అనేది నటీనటుల వ్యక్తిగత నిర్ణయం. తెలుగు సినిమాల్లో కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ సౌత్ సినిమా లేదా తెలుగు సినిమా అంటేనే లోపం అన్నట్టు రాధిక మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే హిందీ సినిమాల్లో తెలుగు సినిమాల కన్నా కూడా నెగెటివిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.