మా టికెట్ రేట్లు తక్కువే.. పాప్ కార్న్ కూడా చీపే: PVR ఎండీ

ఆయన చెప్పిన లెక్కలు కాగితాల మీద బాగున్నా, సామాన్యుడి అనుభవానికి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.;

Update: 2025-12-29 10:19 GMT

మల్టీప్లెక్స్ లలో సినిమా చూడటం అనేది సామాన్యుడికి ఈ రోజుల్లో ఒక ఖరీదైన వ్యవహారంగా మారింది. టికెట్ రేట్ల సంగతి పక్కన పెడితే, లోపల అమ్మే స్నాక్స్ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే PVR ఐనాక్స్ ఎండీ అజయ్ బిజిలీ మాత్రం తమ ధరలు అస్సలు ఎక్కువ కాదని సమర్థించుకున్నారు. తమ దగ్గర సగటు టికెట్ ధర రూ. 259 మాత్రమేనని, పాప్ కార్న్ ధర రూ. 159 నుంచే మొదలవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

ఆయన చెప్పిన లెక్కలు కాగితాల మీద బాగున్నా, సామాన్యుడి అనుభవానికి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. రూ. 259 అనేది యావరేజ్ మాత్రమేనని, ఇందులో టైర్ 2 సిటీల రేట్లు, రూ. 99 ఆఫర్లు అన్నీ కలిపి ఉంటాయని నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. మెట్రో సిటీల్లో, ప్రైమ్ లొకేషన్లలో వీకెండ్ సినిమా చూడాలంటే టికెట్ రేటు రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉంటోందని, ఎండీ గారు చెప్పిన రేటుకు ఎక్కడా టికెట్లు దొరకడం లేదని కౌంటర్లు వేస్తున్నారు.

అసలు సమస్య టికెట్ రేట్ల కంటే ఫుడ్ దగ్గరే ఎక్కువగా ఉందని ఆడియెన్స్ వాపోతున్నారు. 10 రూపాయల ఖర్చు అయ్యే మొక్కజొన్నను రూ. 159 కి అమ్మడం ఏ రకమైన న్యాయం అని ఓ యూజర్ ప్రశ్నించారు. అది కూడా స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే, మనం రెగ్యులర్ గా తీసుకునే కాంబోలు రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉంటున్నాయి. బయట దొరికే వాటిని లోపలికి అనుమతించరు, లోపల ఏమో రేట్లు మండిపోతుంటాయి.. ఇదొక రకమైన మోనోపోలీ అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్తే పరిస్థితి ఏంటని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఫ్యామిలీలో నలుగురు సినిమాకు వెళ్తే టికెట్లు, స్నాక్స్ అన్నీ కలుపుకుని కనీసం రూ. 1000 నుంచి రూ. 2000 వరకు ఖర్చు అవుతోందని లెక్కలు చెప్పారు. కేవలం పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కోసమే టికెట్ రేటుకి సమానంగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో.. సామాన్యులు రెగ్యులర్ గా థియేటర్లకు వెళ్లలేకపోతున్నారని అంటన్నార్రు .

అందుకే ఈ మధ్య కాలంలో కేవలం భారీ బ్లాక్ బస్టర్ సినిమాలకు మాత్రమే థియేటర్లు నిండుతున్నాయి. చిన్న, మిడిల్ రేంజ్ సినిమాలను జనం ఓటీటీలో చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. థియేటర్ యాజమాన్యాలు చెప్తున్న 'సగటు' లెక్కలకు, ప్రేక్షకుడి జేబుకు పడుతున్న చిల్లుకు ఎక్కడా పొంతన కుదరడం లేదని మరికొందరు చెబుతున్న మాట. ఏదేమైనా PVR ఎండీ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తోంది. రూ. 159 కి పాప్ కార్న్ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పండని సెటైర్లు వేస్తున్నారు. ఫుడ్ అండ్ బెవరేజెస్ రేట్లు తగ్గించకుండా, టికెట్ రేట్లు తక్కువే అని కలరింగ్ ఇవ్వడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News