దివంగత భారతీ రాజా చివరి టీజర్ చూసి ఫ్యాన్స్ భావోద్వేగం!
ఈ టీజర్‌లో ప్రదర్శించిన దృశ్యాలు- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
తమిళ చిత్రసీమలో దైవాంశసంభూతుడైన దర్శకుడుగా సమున్నత గౌరవం పొందిన దివంగత దర్శకదిగ్గజం, నటుడు భారతీరాజా ప్రధాన పాత్రలో నటించిన `పులవర్` తమిళ చిత్రం టీజర్ ఇటీవల లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలైంది. ఈ అధికారిక టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే లక్షకు పైగా వీక్షణలు సాధించి సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. మురుకయ్య దర్శకత్వంలో సమీర్ భరత్ రామ్ - కాశీ విశ్వనాథన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో .. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ టీజర్‌లో ప్రదర్శించిన దృశ్యాలు- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపుదిద్దుకున్న ఈ టీజర్‌లోని మ్యూజిక్ డిజైన్- ఎడిటింగ్ - ఛాయాగ్రహణాన్ని నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. నటి రైచల్ రబెక్కా, సెంథిల్ కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రంలో భారతీరాజా ఒక అత్యంత విభిన్నమైన పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్ చూసిన అభిమానులు ఆయన నటనను, స్క్రీన్ ప్రెజెన్స్‌ను గుర్తుచేసుకుంటూ యూట్యూబ్‌లో `రెస్ట్ ఇన్ పీస్` (RIP) అని భావోద్వేగమైన నివాళులు అర్పిస్తున్నారు.
1970ల కాలంలో తమిళ- తెలుగు చిత్రసీమలు కేవలం నాలుగు గోడల స్టూడియోలకే పరిమితమైన తరుణంలో సినిమాలను బయటకు తీసుకువచ్చి పల్లెటూరి పచ్చదనాన్ని.. మట్టి వాసనను వెండితెరకు పరిచయం చేసిన ఘనత భారతీరాజాది. 1977లో `16 వయాతినిలే` చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన అదే చిత్రాన్ని తెలుగులో `పదహారేళ్ళ వయసు`గా రీమేక్ చేసి సంచలన విజయం సాధించారు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన `సీతాకోకచిలుక` చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది అవార్డును సైతం సొంతం చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించిన ఆయన మంగమ్మగారి మనవడు, పల్నాటి పౌరుషం వంటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.
కేవలం మెగాఫోన్ పట్టి సరికొత్త దర్శకులకు మార్గదర్శిగా నిలవడమే కాకుండా.. నటుడిగానూ తనలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ఆవిష్కరించారు భారతీరాజా. పలు తమిళ, తెలుగు చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన భారతీరాజా 2026 జూన్ 10న కన్నుమూశారు. ఆయన మరణించడానికి ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న చివరి ప్రాజెక్ట్‌లలో `పులవర్` ఒకటి కావడం ఈ సినిమాకు అత్యంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. లెజెండరీ మేకర్ చివరిగా కెమెరా ముందుకు వచ్చిన చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యత మరింత పెరిగింది.
ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ టీజర్‌పై చిత్రబృందం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్ట్ కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులు `పులవర్` ప్రయాణం తమకు ఒక మరచిపోలేని జ్ఞాపకమని వ్యాఖ్యానిస్తున్నారు. భారతీరాజా నటన.. మురుకయ్య దర్శకత్వ ప్రజ్ఞ.. క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ కలగలిసి వస్తున్న ఈ `పులవర్` చిత్రం థియేటర్లలో విడుదలయ్యాక ఏ స్థాయిలో విజయాన్ని సాధించి.. దివంగత దిగ్గజానికి సరైన నివాళిగా నిలుస్తుందో వేచి చూడాలి.