త్రిష మా ఫ్యామిలీ మెంబర్
తమిళనాడు ముఖ్య మంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమ్రోగుతున్న విషయం తెల్సిందే
తమిళనాడు ముఖ్య మంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమ్రోగుతున్న విషయం తెల్సిందే. విజయ్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచే త్రిషతో ఆయనకు రిలేషన్ ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ తన భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు రెడీ కావడంతో త్రిషతో ఆయన రిలేషన్ నిజమే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇద్దరూ ఆ విషయాన్ని ఎక్కడ నిర్థారించలేదు. విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం కు త్రిష హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది. ఆమె ఒక సాధారణ గెస్ట్‌గా కాకుండా ప్రధాన గెస్ట్ అన్నట్లుగా ముందు వరుసలోనే కూర్చున్నారు. దాంతో విజయ్, త్రిష రిలేషన్‌షిప్ చాలా దూరం వెళ్లింది, ముందు ముందు ఇద్దరూ వివాహం చేసుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
విజయ్‌తో త్రిష రిలేషన్‌షిప్...
ఒకవైపు రాజకీయ వార్తలతో జోరుగా మీడియాలో త్రిష పతాక స్థాయిలో కనిపిస్తుంది. మరో వైపు ఆమె ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె హీరోయిన్‌గా నటించిన మూవీ విడుదల అయ్యింది. కరుప్పు సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష మరో వైపు రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించబోతున్న భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ భారీ మల్టీ స్టారర్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష కనిపించబోతుందనే వార్తలు జోరుగా వచ్చాయి. ఆ వార్తలు ఇంకా కొనసాగుతున్న ఈ సమయంలో కొత్తగా త్రిష గురించి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యి ఆమెను మళ్లీ వార్తల్లో నిలిపాయ.
అగధ సినిమా విడుదలపై...
ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన 'అగధ' సినిమా విడుదలకు ముస్తాబయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్ మొదలు పెట్టిన ఎంఎస్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రిష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇంటర్వ్యూలో త్రిష గురించి ఎంఎస్ రాజు మాట్లాడుతూ... మహేష్ బాబుతో తాను నిర్మించిన అర్జున్ సినిమాలో మొదట హీరోయిన్‌గా త్రిషను అనుకున్నాం. కథలోని పాత్రకు ఆమె సెట్ కాదని దర్శకుడు భావించారు. అందుకే ఆమెను తీసుకోలేక పోయామని అన్నాడు. అర్జున్ సినిమాలో త్రిష ఉంటే ఫలితం మరోలా ఉండేది అనేది కొందరి అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే ఎంఎస్ రాజు ఇంకా మాట్లాడుతూ త్రిషతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. త్రిష తమ ఫ్యామిలీ మెంబర్ అన్నట్లుగా రాజు చెప్పుకొచ్చారు.
వర్షం సినిమా కోసం త్రిష...
వర్షం సినిమా కోసం త్రిష ఏకంగా 75 రోజుల పాటు వానలో తడుస్తూ షూటింగ్‌లో పాల్గొంది. సాధారణంగా ఒక పాట కోసం వానలో తడిచేందుకే హీరోయిన్స్ ఇబ్బంది పడతారు. అలాంటిది త్రిష ఏకంగా 75 రోజుల పాటు వానలో తడుస్తూ షూటింగ్‌లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. షూటింగ్ సమయంలో త్రిష ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేసి త్రిష వర్షంతో మంచి గుర్తింపు దక్కించుకుందని ఎంఎస్ రాజు అన్నారు. నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎంఎస్ రాజు ఇప్పుడు దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా ఇప్పటి వరకు సక్సెస్ దక్కించుకోలేదు. 2023లో వచ్చిన మళ్లీ పెళ్ళి చర్చనీయాంశం అయినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. మరి అగధ సినిమాతో అయినా ఎంఎస్ రాజు హిట్ కొట్టేనా చూడాలి.