నేను చెత్తలో ఉండటానికి ఇష్టపడలేదు
కోలీవుడ్ మూవీతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, బాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని, అటు నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్‌డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా.;
కోలీవుడ్ మూవీతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, బాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని, అటు నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్‌డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ స్టార్‌డంతో టాప్ పొజీషన్‌లో ప్రియాంక చోప్రా కెరీర్ కొనసాగిస్తోంది. అప్పుడప్పుడు ఆమె వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాల్లో తిరిగి నటిస్తోంది. ముఖ్యంగా ఈమె మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో పాటు మరో రెండు హిందీ సినిమాల్లోనూ ఈమె నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ ఈమె వరుసగా నటిస్తూ బిజీబిజీగా ఉంది.
ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూ...
తాజాగా ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో కూడా బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల గురించి ఈమె మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ను చెత్త అంటూ సంబోధించడంతో చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ వదిలి హాలీవుడ్‌లో ఎక్కువ ప్రాజెక్ట్‌లు చేయడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించిన సమయంలో ఆమె నుంచి వచ్చిన సమాధానం షాకింగ్‌గా ఉంది. బాలీవుడ్ సినిమాలతో స్టార్‌డం దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించడంను చాలా మంది తప్పుబడుతున్నారు. ప్రియాంక చోప్రా తీరు కచ్చితంగా హర్షనీయం కాదంటూ ఆమెను విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్‌ను చెత్తతో పోల్చడంను ఇప్పుడు అంతా వ్యతిరేకిస్తూ ఆమెకి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెడుతున్నారు.
బాలీవుడ్ సినిమాల నుంచి దూరంగా...
సదరు ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... బాలీవుడ్‌లో రాజకీయాలు తనకు అసౌకర్యంగా అనిపించేవి. తాను చెత్తలో ఉండాలని ఎప్పుడూ అనుకోను, ఎందుకంటే ఆ చెత్త వాసన వల్ల మనము పాడై పోతాము. పైగా ఆ వాసనకు అలవాటు పడి పోయి, అటు వైపు ప్రయాణం సాగించే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి చెత్త నుంచి బయట పడాలని అనుకున్నాను. అందుకే దూరంగా ఉన్నాను అంటూ బాలీవుడ్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది. తనకు నచ్చని పరిస్థితుల్లో ఎక్కువ కాలం కొనసాగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే తాను అందులోనుంచి బయట పడాలి అనుకున్న సమయంలో అనూహ్యంగా హాలీవుడ్‌లో ఆఫర్లు దక్కాయి. అక్కడ నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సక్సెస్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. పీసీ వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాల వారు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
వరుసగా హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు..
ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో మూవీస్‌తో మాత్రమే కాకుండా సిరీస్‌తో బాగా బాపులారిటీని సొంతం చేసుకుంది. అమెరికన్ టెలివిజన్ షో ల ద్వారా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. వెబ్ సిరీస్‌లు, టీవీ షో లతో ఈమెకు దక్కిన గుర్తింపు కారణంగా హాలీవుడ్‌లోనూ పెద్ద అవకాశాలు దక్కాయని అంటారు. హాలీవుడ్ ప్రాజెక్ట్‌ల్లో నటించిన తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాల్లో నటించాలనే ఆలోచన పై ప్రియాంక చోప్రా స్పందిస్తూ నన్ను అభిమానించే వారి కోసం అన్నట్టుగా సమాధానం ఇచ్చింది. వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు పాత్రకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పాత్ర నిడివి ఎక్కువగా ఉంటేనే ప్రియాంక చోప్రా చేసేందుకు ఒప్పుకుంటుంది. కనుక రాజమౌళి ఈ సినిమాలో పీసీ పాత్రను ఎక్కువ సమయం చూపించే అవకాశం ఉంది.