వేతన అసమానత్వాన్ని నిలదీసిన పీసీ
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా ఫేమస్. ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.;
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా ఫేమస్. ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సరసన నటిస్తోంది. పీసీ బాలీవుడ్ అగ్ర హీరోల సరసన అవకాశాల్ని కూడా కాదనుకుని తెలుగు సినిమాలో నటిస్తోంది. ఇంతకుముందు రాజమౌళి- మహేష్ లతో ఆన్ లొకేషన్ స్టిల్స్ ని షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
తాజాగా పీసీ బాలీవుడ్ లో వేతన వ్యత్సాసం గురించి మాట్లాడిన ఓ త్రోబ్యాక్ వీడియో ఇంటర్నెట్ లో వైరలవుతోంది. ఇందులో తనకు మేల్ కోస్టార్ కి ఇచ్చిన పారితోషికంలో 10శాతం కూడా ఇవ్వని రోజులు ఉన్నాయని వెల్లడించింది. హీరోలతో సమాన జీతం తనకు ఎప్పుడూ ఎవరూ ఇవ్వలేదని కూడా వెల్లడించింది. ఈ రంగంలో పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఎక్కువ.. ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉంది. మేం మగ నటులతో సమానంగా పని చేస్తాము. అందుకే మా తరం నటీమణులు సమాన వేతనం గురించి అడిగారు. అడిగినా మాకు అది ఇవ్వలేదు. మేం సెట్లో గంటల తరబడి ఎదురు చూస్తుంటే, షాట్ కి ఎప్పుడు రావాలో హీరో నిర్ణయించుకుంటాడు.. అని కూడా పీసీ వ్యాఖ్యానించింది.
తన శరీర రంగు గురించి కూడా బాలీవుడ్ లో తొలి రోజుల్లో విమర్శించారని పీసీ తెలిపింది. నేను అంత అందంగా లేనని కామెంట్లు చేసారు. లేత రంగు ఉంటేనే కథానాయికగా అవకాశాలిచ్చేవారు. దీంతో నా తోటి నటుల కంటే నేను ఎక్కువగా శ్రమించాను...చాలా కష్టపడ్డాను అని పీసీ తెలిపింది. తాను హాలీవుడ్ కి వెళ్లాక అక్కడ మగ నటులతో సమానంగా పారితోషికం చెల్లించారని కూడా వెల్లడించింది.