కంటెంట్ కంటే హీరోల ఆధిపత్యమే ఎక్కువ!
తాజాగా ప్రియదర్శన్ బాలీవుడ్ హీరోలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు.;
చలనచిత్ర రంగంలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్. మలయాళంతో పాటు, తెలుగు తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో చిత్రాలు తెరకెక్కించారు. తాజాగా ప్రియదర్శన్ బాలీవుడ్ హీరోలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. హిందీ చిత్ర పరిశ్రమలో కంటెంట్ కంటే నటుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోందని ప్రియదర్శన్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యత ఉండేదన్నారు. కానీ ఇప్పుడు స్టార్ ఇమేజ్ చుట్టూనే సినిమాలు తిరుగుతున్నాయన్నారు. దీనివల్ల దర్శకులకు తమ సృజనాత్మకతను చాటుకునే స్వేచ్ఛ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ మేకర్స్ కొత్త ప్రయోగాలకు భయపడు తున్నారని సురక్షితమైన మార్గాల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రియదర్శన్ విశ్లేషించారు.
ఒక సినిమా విజయం సాధించాలంటే అందులో బలమైన కథాంశం ఉండాలి. కానీ ప్రస్తుతం భారీ బడ్జెట్ మరియు స్టార్ కాస్టింగ్ ఉంటే చాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల హిందీ సినిమాల్లో మునుపటిలా వైవిధ్యం కనిపించడం లేదన్నారు. ఫలితంగా ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని వివరించారు.దర్శకులకు ఉండాల్సిన క్రియేటివ్ లిబర్టీ గురించి మాట్లాడారు. `నటుల ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలను మార్చాల్సి రావడం వల్ల అసలు ఉద్దేశ్యం దెబ్బతింటుందనన్నారు. సినిమా అనేది దర్శకుడి ఆలోచన కావాలని కానీ వాణిజ్య లెక్కల వల్ల అది హీరోల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతోందని ఆరోపించారు.
ఈ పరిస్థితి మారనంత వరకు బాలీవుడ్‌లో గొప్ప కథలతో కూడిన సినిమాలు రావడం కష్టమన్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో తాను చేస్తున్న `భూత్ బంగ్లా` సినిమా గురించి కూడా ప్రస్తావించారు. హారర్ కామెడీ జానర్‌లో రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం ద్వారా మళ్లీ పాత రోజులను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కథా బలంతో పాటు, వినోదాన్ని పంచే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని `భూత్ బంగ్లా` అలాంటి ఒక మంచి ప్రయత్నం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే దక్షిణాది సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోవడానికి ప్రధాన కారణం అక్కడి దర్శకులు కథలకు ఇస్తున్న ప్రాధాన్యతేనని సూచించారు. బాలీవుడ్ కూడా నటుల ఇమేజ్ కంటే కంటెంట్‌ను నమ్ముకుని ముందుకెళ్తేనే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని హితవు పలికారు. కేవలం కమర్షియల్ ఫార్ములాలకు పరిమితం కాకుండా కొత్త ప్రయోగాలకు తెరలేపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై బబాలీవుడ్ హీరోలు ఎవరైనా స్పందిస్తారా? అన్నది చూడాలి. అయితే బాలీవుడ్ వరుస వైఫల్యాల్లో ఉన్న సమయంలో అమీతాబచ్న్, అమీర్ఖాన్ , సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు బాహాటంగా మనోళ్ల క్రియేటివిటీ కొరవడిందని విమర్శించారు. రైటింగ్ విధానం మారాలని సూచిం vచారు. ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్` ప్రాంచైజీతో మళ్లీ బాలీవుడ్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విజయం బాలీవుడ్ లో సరికొత్త చరిత్ర అవకాశం కనిపిస్తోంది.