వివాదంతో పెద్ద ప్రచారం కొట్టేసిన వర్థమాన నటి
అయితే ఇటీవల కన్నప్ప, బ్లాస్ట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ధమాన నటి ప్రీతి ముకుందన్ పాల్గొన్న ఓ ప్రచార కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది
సినిమా ప్రమోషన్లలో వినూత్న పద్ధతులు పాటించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే ఇటీవల కన్నప్ప, బ్లాస్ట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ధమాన నటి ప్రీతి ముకుందన్ పాల్గొన్న ఓ ప్రచార కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొనడానికి ఆమెను గ్రాండ్‌గా రథంపై ఊరేగింపుగా తీసుకెళ్లడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ ఊరేగింపు సందర్భంగా అందాల భామను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు, జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడ్డారు. పబ్లిసిటీ స్టంట్ల పేరుతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందంటూ పలువురు హితవు పలికారు.
ఇదే సమయంలో ప్రీతి ముకుందన్ కుటుంబ నేపథ్యం గురించి కూడా నెట్టింట ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌కు ఈ నటి మనవరాలు (గ్రాండ్ డాటర్) అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని.. రామానుజన్ 1920లో తన 32వ ఏటనే సంతానం లేకుండా పరమపదించారని.. కాబట్టి ఆయనకు నేరుగా వారసులు ఎవరూ లేరని స్పష్టమవుతోంది.
నెటిజన్లు అనుకుంటున్నట్లు రామానుజన్‌కు ప్రీతి ప్రత్యక్ష మనవరాలు కాకపోయినా ఆమె ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ప్రీతి ముకుందన్‌కు రామానుజన్ వరుసకు ముత్తాత (గ్రేట్-గ్రాండ్ అంకుల్) అవుతారు. రామానుజన్ తమ్ముడి కుమారుడే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కర్నాటిక్ జాజ్ గిటారిస్ట్ గిటార్ ప్రసన్న (ప్రసన్న రామస్వామి) .. ఆయన సోదరి డాక్టర్ దీపా ముకుందన్. ఈ డాక్టర్ దీపా ముకుందన్ మరెవరో కాదు, హీరోయిన్ ప్రీతి ముకుందన్ తల్లే.
అంటే గిటార్ ప్రసన్నకు ప్రీతి మేనకోడలు కాగా.. శ్రీనివాస రామానుజన్ ఆమెకు తల్లి తరఫు నుంచి ముత్తాత వరుస అవుతారు. సోషల్ మీడియాలో కుటుంబ వృక్షాన్ని కాస్త అటూ ఇటూగా ప్రచారం చేసినా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త రక్తం తన నరాల్లో కూడా ప్రవహిస్తోందని తెలిసి ప్రీతి ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ వివాదం.. మరోవైపు ఈ అరుదైన ఫ్యామిలీ కనెక్షన్‌తో ప్రీతి ముకుందన్ పేరు ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో తెగ మారుమోగిపోతోంది.