ఆ కాంట్రాక్టర్‌ రాజమౌళి... జక్కన్న గురించి ప్రశాంత్‌ నీల్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. రాజమౌళి గురించి వివరించడం, ఆయన గొప్పతనం చెప్పడం సామాన్యులకు సాధ్యం కాదు.;

Update: 2025-10-31 10:03 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. రాజమౌళి గురించి వివరించడం, ఆయన గొప్పతనం చెప్పడం సామాన్యులకు సాధ్యం కాదు. రాజమౌళి వంటి దర్శకుడి గురించి చెప్పాలంటే ఆ స్థాయిలో ప్రతిభ ఉన్న ఒక సుకుమార్‌ లేదా ప్రశాంత్‌ నీల్ వంటి దర్శకులు చెప్పాలి. వారు ఇద్దరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో రాజమౌళి గురించి చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. తెలుగు సినిమాకు పాన్ ఇండియా మార్కెట్‌ను క్రియేట్‌ చేసిన రాజమౌళి గురించి బాహుబలి : ది ఎపిక్‌ రిలీజ్ సందర్భంగా మరోసారి చర్చ మొదలైంది. ఆయన గొప్పతనం ఏంటి అనేది బాహుబలి రీ రిలీజ్‌తో మరోసారి నిరూపితం అయింది. పదేళ్ల క్రితం వచ్చిన సినిమాను మళ్లీ తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాలను ఊపేసే సత్తా కేవలం రాజమౌళికి కాకుండా మరెవ్వరికి ఉంటుంది చెప్పండి.

రాజమౌళి గురించి ప్రశాంత్‌ నీల్‌...

బాహుబలి ది ఎపిక్‌ రిలీజ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్‌, సెలబ్రిటీలు, దర్శకనిర్మాతలు సోషల్‌ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రశాంత్‌ నీల్‌ భార్య లిఖిత రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ స్టోరీలో ప్రశాంత్‌ నీల్‌ తన అభిమాన దర్శకుడు అయిన రాజమౌళి గురించి చేసిన కామెంట్స్ ఉన్నాయి. ఆ పోస్ట్‌లో... ఒక రోడ్డుకు మరమ్మత్తులు చేయాల్సి వచ్చింది, ఆ బాధ్యతను ఒక కాంట్రాక్టర్‌కి అప్పగించడం జరిగింది. మరమత్తులు వేయమని చెప్పిన ఆ రోడ్డును ఏకంగా 16 లేన్ల సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాడు. ఆ రోడ్డు పేరు పాన్‌ ఇండియా, ఆ కాంట్రాక్టర్‌ పేరు ఎస్‌ఎస్‌ రాజమౌళి. బాహుబలి మొత్తం టీంకి అభినందనలు, ఒక తరం కోసం కలలు కన్నందుకు కృతజ్ఞతలు అంటూ ప్రశాంత్‌ నీల్‌ రాసుకు వచ్చాడు. ఇది ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

పాన్ ఇండియా సినిమాలకు కారణం రాజమౌళి

ప్రశాంత్‌ నీల్‌ మూవీ కేజీఎఫ్‌ కి ఆ స్థాయి క్రేజ్‌, బజ్‌ క్రియేట్‌ కావడానికి ప్రధాన కారణం రాజమౌళి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి ప్రోత్సాహం కారణంగానే కన్నడంలో రూపొందిన కేజీఎఫ్‌ సినిమాను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే పాన్ ఇండియా సినిమాగా కేజీఎఫ్‌ను విడుదల చేయడం జరిగిందని ప్రశాంత్‌ నీల్‌ చెబుతూ ఉంటాడు. కేజీఎఫ్‌ 2 సినిమాను అంతకు మించి అన్నట్లుగా రూపొందించడంలో, ఆ సినిమా వెయ్యి కోట్లకు మించి వసూళ్లు చేయడంలో ఖచ్చితంగా రాజమౌళి వేసిన మార్గం, ఆయన వెన్నుదన్నుగా నిలవడం కారణం అంటూ ఉంటారు. అలాంటి గొప్ప దర్శకుడి గురించి, తనదైన మాటల్లో ప్రశాంత్‌ నీల్‌ ఇలాంటి పోస్ట్‌ పెట్టడం ద్వారా తనకు ఉన్న అభిమానంను చాటుకున్నాడు. రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయనే విషయం తెల్సిందే.

బాహుబలి : ది ఎపిక్ కలెక్షన్స్‌

బాహుబలి : ది ఎపిక్‌ సినిమాకు భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌ మొదలైనప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. డైరెక్ట్‌ సినిమా మాదిరిగా, స్టార్‌ హీరోల సినిమాల మాదిరిగా ఈ సినిమా ఓపెనింగ్‌ను సాధించడం ఖాయం అని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకోవడం జరిగింది. అన్నట్లుగానే సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఎడిటింగ్‌తో మాయ చేసి, వీఎఫ్‌ఎక్స్‌ ను మరింత అందంగా చూపించి, రాజమౌళి తన వాయిస్‌ను వినిపించడం ద్వారా బాహుబలి : ది ఎపిక్‌ కొత్తగా ఉందని, కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేసే విధంగా సినిమా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. బాహుబలి ది ఎపిక్‌ లాంగ్‌ రన్‌ లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. మరి బాక్సాఫీస్ ఫలితం ఏంటి అనేది మొదటి రోజు కలెక్షన్స్‌ను బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News