ప్రకాశ్ రాజ్ ఫైర్.. సినిమా వేడుకల్లో పాలిటిక్స్ ఏంటి?
సినీ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఊహించని కామెంట్స్ తో ప్రకాశ్ రాజ్ హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.;
సినీ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఊహించని కామెంట్స్ తో ప్రకాశ్ రాజ్ హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. తన మనసులో ఏమున్నా దాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ప్రకాశ్ రాజ్ స్టైల్. లేటెస్ట్ గా ఈ వెర్సటైల్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కళకు, రాజకీయాలకు మధ్య ఉన్న గీత చెరిగిపోతోందని, ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ముఖ్యంగా సినిమా పండుగల్లో జరుగుతున్న పరిణామాలపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న 17వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ప్రకాశ్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 6 వరకు సాగే ఈ ఫెస్టివల్‌లో విభిన్న దేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. ఇలాంటి వేడుకల ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న ఆలోచనలను, సంస్కృతులను పంచుకోవడమే. అయితే ఇప్పుడు ఈ వేదికలపై కూడా రాజకీయాల నీడ పడుతోందని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఈ చలన చిత్రోత్సవాల్లో పాలస్తీనా సినిమాలను ప్రదర్శించకపోవడంపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల ఎంపికలో రాజకీయ జోక్యం పెరిగిపోతోందని, ఇది కళాకారుల స్వేచ్ఛను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నేరుగా విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆ సినిమాలను ప్రదర్శించిందని, అదే దారిలో కర్ణాటక కూడా అడుగులు వేయాలని కోరారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాలను నిషేధించడం వల్ల చిత్రోత్సవాల అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. సాహిత్యం, సినిమా అనేవి సమాజంలో మార్పు తీసుకురావడానికి వాడే ఆయుధాలని, వాటిని ఒక పక్షానికే పరిమితం చేయడం సరికాదని చెప్పారు. కేవలం కొన్ని రాజకీయ కారణాల వల్ల సినిమాలను అడ్డుకోవడం వల్ల కొత్త ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లకుండా పోతాయని అన్నారు.
ప్రకాశ్ రాజ్ చేసిన ఈ డిమాండ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం అంతర్జాతీయ సంబంధాల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలే ఫైనల్ అని వాదిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య మాత్రం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సు కోరే సినిమాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ తోడుంటుందని భరోసా ఇచ్చారు. కానీ పాలస్తీనా సినిమాల ప్రదర్శనపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక ప్రకాశ్ రాజ్ వేసిన ఈ పొలిటికల్ పంచ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత కూడా అని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఫిబ్రవరి 6న ఈ ఫెస్టివల్ ముగిసేలోపు పాలస్తీనా సినిమాల ప్రదర్శనపై ఏవైనా మార్పులు జరుగుతాయో లేదో చూడాలి. ఏదేమైనా ప్రకాశ్ రాజ్ మాటలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.