విజయ్‌తో అనుకున్న కథనే ప్రదీప్ చేస్తున్నాడా?
డ్యూడ్ సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్.;
డ్యూడ్ సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఆ సినిమా రిలీజైనప్పటి నుంచి ప్రదీప్ యొక్క కెరీర్ గ్రాఫ్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. డ్యూడ్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి. టైర్2 కోలీవుడ్ స్టార్ కలెక్షన్లతో ప్రదీప్ సినిమాల కలెక్షన్లు పోటీ పడటంతో అందరూ అతను చేసే తర్వాతి సినిమాలపై ఆసక్తిగా ఉన్నారు.
డిసెంబర్ 18న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
ప్రదీప్ నుంచి తర్వాతి సినిమాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రాబోతుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఆఖరికి డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. LIK తర్వాత తన నుంచి ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రానుందని రీసెంట్ గా డ్యూడ్ ప్రమోషన్స్ లో ప్రదీప్ వెల్లడించారు.
విజయ్ తో చేయాల్సిన సైన్స్ ఫిక్షన్ మూవీ
ఆ సైన్స్ ఫిక్షన్ మూవీకి ప్రదీప్ దర్శకత్వం వహించడంతో పాటూ అందులో లీడ్ రోల్ ను కూడా తానే చేయనున్నట్టు వెల్లడించారు. అయితే గతంలో కోమలి మూవీ తర్వాత ప్రదీప్, దళపతి విజయ్ కు ఓ సైన్స్ ఫిక్షన్ కథను చెప్పారని, విజయ్67 గా ఈ మూవీనే రానుందని అందరూ అనుకున్నారు. కానీ విజయ్67గా లియో వచ్చింది. షెడ్యూల్స్, మరియు కొన్ని క్రియేటివ్ రీజన్స్ వల్ల విజయ్ తో ఆ ప్రాజెక్టు చేయడం ప్రదీప్ కు కుదరలేదు.
ఇప్పుడదే కథతో హీరోగా ప్రదీప్ సినిమాను చేయనున్నారని, ఆ కథను తన ఇమేజ్ కు సూటయ్యేలా మార్చి రూపొందించాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ప్రదీప్ ట్రాక్ రికార్డు పరంగా చూసుకుంటే ఇప్పటికే అతనిపై భారీ అంచనాలున్నాయి. లవ్ టుడే తర్వాత ప్రదీప్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ LIK తర్వాత ప్రదీప్ నుంచి తర్వాత రాబోయే సినిమా విజయ్ కోసం రాసిందేనా లేక కొత్త కథనా అనేది తెలియాల్సి ఉంది. కథ ఏదైనా ప్రదీప్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ కావడంతో దానిపై మంచి అంచనాలు నెలకొనడం ఖాయం.