ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద సూపర్‌స్టార్ కాదా?
భారతదేశంలో అతిపెద్ద సినీపరిశ్రమగా బాలీవుడ్ ఇంతకాలం గొప్పలు చెప్పుకుంది. ఇది నిజమే అయినా కానీ, సక్సెస్ లేక ఐదారేళ్లుగా పరిశ్రమ విలవిలలాడుతోంది.;
భారతదేశంలో అతిపెద్ద సినీపరిశ్రమగా బాలీవుడ్ ఇంతకాలం గొప్పలు చెప్పుకుంది. ఇది నిజమే అయినా కానీ, సక్సెస్ లేక ఐదారేళ్లుగా పరిశ్రమ విలవిలలాడుతోంది. అదే సమయంలో సౌత్ సినిమా సక్సెస్ రేటును పెంచుకుని పాన్ ఇండియా అప్పీల్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అరడజను పైగా స్టార్లు పాన్ ఇండియాలో నిరూపించుకుంటూ ముందుకు దూసుకెళుతుంటే, అదే సమయంలో బాలీవుడ్ అగ్ర హీరోలంతా ఫ్లాపులతో డీలా పడిపోయారు.
దురదృష్టవశాత్తూ బాలీవుడ్ హీరోలు ఎప్పటికీ సౌత్ మార్కెట్ ని ఛేజిక్కించుకోలేకపోతున్నారు. పర్యవసానంగా పాన్ ఇండియాలో మ్యాజిక్ చేయలేని పరిస్థితి ఉంది. అదే సమయంలో సౌత్ హీరోలు, ముఖ్యంగా తెలుగు హీరోలు హిందీ బెల్ట్ లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తరాది, దక్షిణాది అనే విభేధం లేకుండా ఉత్తరాది ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం నిజంగా సౌత్ హీరోలకు కలిసొస్తోంది.
సరిగ్గా ఇదే ఎలిమెంట్ ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ కి పాన్ ఇండియా స్టార్ డమ్‌ని కట్టబెట్టింది. బాహుబలి, సాహో మొదలు సలార్, కల్కి 2898 ఏడి వరకూ ప్రభాస్ ఎదురేలేని హీరోగా పాన్ ఇండియాలో నిరూపించుకున్నాడు. ప్రభాస్ ఉత్తరాదిన ఒక ప్రభంజనంగా మారాడు. తదుపరి అతడు కల్కి 2898 ఏడి సీక్వెల్ సహా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రంతో మరోసారి రికార్డులు తిరగరాస్తాడని అంతా అంచనా వేస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి సమయంలో సందీప్ వంగా స్పిరిట్ ని పట్టాలెక్కిస్తూ అంతకంతకు వేడి పెంచుతున్నాడు. ఇటీవల ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఆడియో టీజర్ దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ లో పూనకాలు తెచ్చింది. ప్రభాస్ మానియాను చూసి కింగ్ ఖాన్ షారూఖ్ అభిమానులు సైతం కంగు తిన్నట్టే కనిపిస్తోంది. టీజర్ లో ప్రభాస్‌ను ''భారతదేశంలో అతిపెద్ద సూపర్‌స్టార్'' అంటూ గర్వంగా పరిచయం చేసారు సందీప్ వంగా. ఇది నిజానికి ఖాన్ అభిమానులకు నచ్చడం లేదు. ప్రపంచవ్యాప్తంగా షారూఖ్ కి ఉన్న స్టార్ డమ్ తో ప్రభాస్ స్టార్ డమ్ సరిపోలదని వారంతా వాదిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో షారూఖ్ కి అసాధారణ ఫాలోయింగ్ ఉందని వాదిస్తున్నారు.
ఖాన్ అభిమానులు వాదించేది నిజమే.. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ ఫిగర్స్ ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. విదేశాలలో వేగంగా ప్రభాస్ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు. షారూఖ్ కి దశాబ్ధాలుగా విదేశీ ఫ్యాన్స్ కొలువు దీరి ఉన్నారు. కానీ అది బాక్సాఫీస్ నంబర్స్ గా మారుతోందా? అంటే చెప్పలేని పరిస్థితి. ప్రభాస్ సినిమాలు విదేశాల నుంచి కూడా అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్నాయి. బాహుబలి ఫ్రాంఛైజీతో అతడి స్టార్ డమ్ విదేశాల్లో అసాధారణంగా పెరిగింది. సలార్, కల్కి 2898 ఏడి లాంటి బ్లాక్ బస్టర్లతో విదేశీ ఫ్యాన్ బేస్ ని మరింత వేగంగా పెంచుకున్నాడు. ఖాన్ ల త్రయం అభిమానులు సౌత్ హీరోలను తక్కువగా అంచనా వేయడం మానుకుంటేనే మంచిది. దేశంలోని అతి పెద్ద స్టార్లుగా చెప్పుకునే ఖాన్ ల సరసన ప్రభాస్ పేరు వినిపిస్తోంది అంటే అది అతడు సాధించిన అఛీవ్ మెంట్. ఖాన్ ల అభిమానులు కుళ్లుకునేంతగా ప్రభాస్ ఎదిగినందుకు సౌత్ సినిమా గర్విస్తోంది.