ప్రభాస్‌తో మళ్లీ అదే సమస్య...!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయాడు, అయితే ఈ ఏడాది ఆరంభంలోనే రాజా సాబ్ సినిమాతో వచ్చాడు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయాడు, అయితే ఈ ఏడాది ఆరంభంలోనే రాజా సాబ్ సినిమాతో వచ్చాడు. మారుతి దర్శకత్వంలో రూపొందిన రాజాసాబ్ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. గత ఏడాది లోటును ఈ ఏడాది రెండు సినిమాలతో భర్తీ చేయాలని ప్రభాస్ అనుకున్నాడు. గత పదేళ్లుగా ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేయాలి అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ ప్రతి సారి ఏదో ఒక కారణంతో సినిమాలు వాయిదా పడటం, షూటింగ్ ఆలస్యం కావడం జరుగుతుంది. ఈ ఏడాదిలో ఫౌజీ సినిమాతో ప్రభాస్ రావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒక వైపు ఫౌజీ సినిమాను చేస్తూనే మరో వైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను మొదలు పెట్టాలని ప్రభాస్ అనుకున్నాడు. కానీ అలా జరిగే పరిస్థితి లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
స్పిరిట్ మూవీ షూటింగ్...
ప్రభాస్ గత ఏడాది నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్‌ను హెల్డ్‌లో పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ తన దృష్టిని ఫౌజీ పై పెట్టాడు. స్పిరిట్ సినిమా కోసం సందీప్ వంగ బల్క్ డేట్లు కావాలని కోరాడని, అందుకు ప్రభాస్ ఓకే చెప్పాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఫౌజీ షూటింగ్ పూర్తి అయితే తప్ప ఇప్పుడు ప్రభాస్ బల్క్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే స్పిరిట్ సినిమా మొదలు పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుందని సమాచారం అందుతోంది. ప్రభాస్‌తో ఏ సినిమా మొదలు పెట్టినా ఇదే పరిస్థితి అంటూ ఇండస్ట్రీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఎక్కువ సినిమాలు కమిట్ కావడం, వాటికి సరైన సమయంలో డేట్లు ఇవ్వలేక పోవడం అనేది ప్రభాస్‌కి కామన్ అయ్యింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సందీప్ వంటి దర్శకుడిని దాదాపుగా రెండేళ్లు ఖాళీగా కూర్చోబెట్టిన ఘనత ప్రభాస్ కి దక్కిందని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
బాలీవుడ్‌లో యానిమల్ తర్వాత...
యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో ముఖ్యంగా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన తదుపరి సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. ఆయన ప్రభాస్‌తో కాకుండా మరో హీరోతో తన తదుపరి సినిమాను ప్రకటించి ఉంటే కచ్చితంగా ఇప్పటి వరకు ఆ సినిమా విడుదల అయ్యి ఉండేది అనేది ప్రతి ఒక్కరూ అంటున్న మాట. ప్రతిభావంతుడు అయిన సందీప్ వంగ ఏడాదికి ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ వలలో చిక్కడంతో అటు పోలేక, ఇటు రాలేక అన్నట్లుగా పరిస్థితి మారింది. సందీప్ తో సినిమా అంటే డజను మంది పెద్ద హీరోలు రెడీగా ఉన్నారు. అయినా కూడా సందీప్ మాత్రం ప్రభాస్ కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకుంటే ఆ దర్శకుడు కనీసం రెండేళ్లు ఎదురు చూడాల్సిందే అని మరోసారి నిరూపితం అయిందని టాక్.
ఈ ఏడాదిలోనే ప్రభాస్ ఫౌజీ...
ప్రభాస్ వరుస సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పటికీ ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదు. అందుకే ప్రభాస్ మరోసారి స్పిరిట్ సినిమా షూటింగ్ ను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఫౌజీ సినిమాను మరో రెండు మూడు నెలల్లో పూర్తి చేసి అప్పుడు స్పిరిట్ సినిమాకు ప్రభాస్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఆ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా... ఆయన సినిమాలు కమర్షియల్‌గా నిరాశ పరచినా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు.
ప్రభాస్ సినిమా రాబోతుంది అంటే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫౌజీ 2026 లో విడుదల కానుండగా, స్పిరిట్ మూవీని 2027 లో విడుదల చేస్తామని అన్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కనుక విడుదల విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో రెండు సినిమాలు కూడా ప్రభాస్ నుంచి రావాల్సి ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీ లేదు.