తెలుగు రైట్స్ మొత్తం హీరోకి ఇచ్చేస్తే నిర్మాతలకేంటి లాభం?

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు పారితోషికం తీసుకోకుండా, తెలుగు రైట్స్ తీసుకుంటున్నారని వార్తలు రాగానే అందరూ హీరో వైపు నుంచే ఆలోచించారు.;

Update: 2025-12-07 19:19 GMT

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు పారితోషికం తీసుకోకుండా, తెలుగు రైట్స్ తీసుకుంటున్నారని వార్తలు రాగానే అందరూ హీరో వైపు నుంచే ఆలోచించారు. ప్రభాస్ కు 200 కోట్లు వస్తాయని, జాక్ పాట్ కొట్టారని లెక్కలు వేశారు. కానీ నాణేనికి మరో వైపు చూస్తే.. అసలు నిర్మాతలు టీ సిరీస్, సందీప్ వంగా హోమ్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ ఇంత పెద్ద మార్కెట్ ను ఎందుకు వదులుకున్నారు? తెలుగులో ప్రభాస్ కున్న క్రేజ్ తెలిసి కూడా ఆ రైట్స్ ను ఎందుకు ఇచ్చేశారు అనే సందేహం రాకుండా ఉండదు. కానీ దీని వెనుక నిర్మాతల మాస్టర్ ప్లాన్ చాలా గట్టిగానే ఉందనిపిస్తోంది.

మొదటి విషయం, 'భారం తగ్గించుకోవడం'. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కు రెమ్యూనరేషన్ ఇవ్వాలంటే కనీసం రూ. 150 కోట్లు చేతిలో ఉండాలి. షూటింగ్ మొదలుకాకముందే ఇంత పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇవ్వడం లేదా వడ్డీలకు తెచ్చి ఇవ్వడం అనేది సినిమా బడ్జెట్ ను విపరీతంగా పెంచేస్తుంది. అదే రైట్స్ ఇస్తే, నిర్మాత జేబులోంచి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లదు. ఆ డబ్బును సినిమా క్వాలిటీ మీద, మేకింగ్ మీద ఖర్చు పెట్టొచ్చు. ఆర్థిక ఒత్తిడి లేకుండా సినిమా తీయొచ్చు.

ఇక రెండోది.. 'హిందీ మార్కెట్'. ఈ సినిమాను నిర్మిస్తోంది బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ టీ సిరీస్. సందీప్ రెడ్డి వంగాకు 'యానిమల్' తర్వాత హిందీలో ఎలాంటి మార్కెట్ ఉందో తెలిసిందే. ప్రభాస్ కు అక్కడ ఎలాగూ పట్టుంది. కాబట్టి హిందీ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు వందల కోట్లు వస్తాయి. కేవలం నార్త్ ఇండియా నుంచే బడ్జెట్ లో సగభాగం రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి తోడు తమిళ, మలయాళ, కన్నడ రైట్స్ అదనం.

మూడోది.. అసలైన బంగారు గని 'నాన్ థియేట్రికల్ రైట్స్'. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకు ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలోనే సగం పెట్టుబడి వచ్చేస్తోంది. 'స్పిరిట్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ కు నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ వాళ్లు కళ్లు చెదిరే ఆఫర్ ఇస్తారు. ఆడియో కంపెనీ టీ సిరీస్ దే కాబట్టి మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చే లాభం మొత్తం వారికే సొంతం. ఈ లెక్కన చూస్తే, సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతలు "టేబుల్ ప్రాఫిట్" జోన్ లో ఉంటారు.

నాలుగోది.. 'రిస్క్ షేరింగ్'. ఒకవేళ నిర్మాతలే 150 కోట్లు ఇచ్చి, సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తే.. ఏదైనా తేడా జరిగితే నష్టం మొత్తం వారిదే. కానీ ఇలా రైట్స్ ఇవ్వడం వల్ల, తెలుగు మార్కెట్ బాధ్యత మొత్తం ప్రభాస్ భుజాల మీదకు వెళ్తుంది. లోకల్ గా ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ ప్రభాస్ టీమ్ చూసుకుంటుంది. దీనివల్ల నిర్మాతలకు పనిభారం, రిస్క్ రెండూ తగ్గుతాయి. ఫైనల్ గా.. ఇది నిర్మాతలకు నష్టం వచ్చే బేరం అస్సలు కాదు. తెలుగు మార్కెట్ ను ప్రభాస్ కు వదిలేసి, మిగతా మార్కెట్ మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. పైసా పెట్టుబడి లేకుండా స్టార్ హీరో డేట్స్ దొరికాయి, నాన్ థియేట్రికల్ ద్వారా సేఫ్ అయిపోయారు. అందుకే దీన్ని బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

Tags:    

Similar News