హీరో కంటే డైరెక్టర్ ప్రపంచమే అసలు కిక్కు
ఒకప్పుడు పెద్ద హీరో సినిమా అంటే అతని ఇమేజ్‌కు సరిపోయే కథ, ఫైట్లు, పాటలు ముందుండేవి.
ఒకప్పుడు పెద్ద హీరో సినిమా అంటే అతని ఇమేజ్‌కు సరిపోయే కథ, ఫైట్లు, పాటలు ముందుండేవి. దర్శకుడు కూడా ఆ స్టార్‌ను ఏ కోణంలో చూపించాలి అన్నదే చూసేవాడు. ఇప్పుడు కొన్ని భారీ సినిమాల్లో లెక్క మారుతోంది. హీరో తన పాత ఫార్ములాను వెంట తీసుకెళ్లడం కంటే, దర్శకుడు ముందే తయారు చేసిన ప్రపంచంలోకి వెళ్లిపోతున్నాడు. లుక్, బాడీ లాంగ్వేజ్, పాత్ర తీరు కూడా ఆ సినిమా టోన్‌కు తగ్గట్టే మారుతోంది. హీరో కంటే డైరెక్టర్ ప్రపంచమే ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘స్పిరిట్’ కూడా అలాంటిదే. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరోను ప్రత్యేకమైన మూడ్‌లో చూపిస్తాడు. ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. షూటింగ్ దాదాపు సగంకు పైగా పూర్తయిందని వంగా చెప్పాడు. వచ్చే ఏడాది మార్చి 5 రిలీజ్ కూడా ఫిక్స్ చేశారు. వంగా అతన్ని ఏ రకంగా చూపించబోతున్నాడన్నదే ఈ కాంబినేషన్‌లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ దగ్గర కూడా ప్రశాంత్ నీల్ ముద్ర ముందే కనిపిస్తోంది. నీల్ సినిమాల్లో ఉండే డార్క్ వరల్డ్, పవర్ పోరు, ప్రత్యేకమైన విజువల్ టోన్ ఈ సినిమాకూ బేస్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌ను రెగ్యులర్ కమర్షియల్ హీరోలా కాకుండా ఆ ప్రపంచంలో భాగంగా చూపించారు. అనిల్ కపూర్, రుక్మిణి వసంత్, బిజు మీనన్ లాంటి పెద్ద కాస్ట్‌తో సినిమా 2027 జూన్ 11న వస్తోంది.
మహేష్ బాబు ‘వారణాసి’లో మార్పు ఇంకా పెద్దది. రాజమౌళి ఈ కథను ఒక్క పార్ట్ గానే పూర్తి చేయనున్నట్టు ఇప్పటికే చెప్పాడు. అంటార్కిటికా నుంచి రామాయణ ఫాంటసీ వరకు విస్తరించే కథలో తండ్రి కొడుకుల బంధం కూడా ఉంటుందని వెల్లడించాడు. మహేష్ గత సినిమాల్లో కనిపించిన అర్బన్, కమర్షియల్ ఇమేజ్ ఇక్కడ కనిపించదు. రాజమౌళి నిర్మించిన భారీ ప్రపంచంలో అతను పూర్తిగా కొత్త పాత్రతో కనిపించబోతున్నాడు.
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడి’తో ఈ మార్పు ముందే చూపించాడు. ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఉన్నా, సినిమా మొత్తం కల్కి ప్రపంచం, భవిష్యత్ నేపథ్యం, ఇతర పాత్రలతో కలిసి సాగింది. ఇప్పుడు రెండో భాగం కూడా అదే ప్రపంచాన్ని కొనసాగించనుంది. నాగ్ అశ్విన్ చెప్పిన ప్రకారం ఇప్పటివరకు దాదాపు పది రోజుల షూటింగ్ పూర్తైంది. ప్రభాస్ డేట్స్ దొరికిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
ఇక దర్శకుల ఇన్వాల్వ్ మెంట్ అనేది వారి స్టైల్ కి తగ్గట్టే ఉంటుంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్ కూడా ఆ దర్శకుడు సెట్ చేసిన టోన్‌లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు పెద్ద స్టార్ సినిమాలో హీరో పాత్రతో పాటు, ఆ దర్శకుడు తన ప్రపంచాన్ని చూపించే విధానంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక నెక్ట్స్ సినిమాలతో మన దర్శకుల రేంజ్ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.