మారుతి 'పెద్ద' మాట... రాజాసాబ్ టీజర్‌తో నమ్మకం!
కనుక కంటెంట్ కనెక్ట్ అయితే రాజాసాబ్ సినిమా కచ్చితంగా రూ.1000 కోట్లకు మించి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.;
ప్రభాస్, మారుతి కాంబోలో రూపొందిన 'రాజాసాబ్' సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా స్థాయిని ఇంకా పెంచేసింది. ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత ఒక పూర్తి స్థాయి కమర్షియల్ పాత్రలో చూడబోతున్నామని టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. సోషల్ మీడియాలో రాజాసాబ్ గురించి ఏ స్థాయిలో ప్రచారం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో రాజాసాబ్ టీజర్‌ను అత్యధికంగా చూస్తున్నారు. వ్యూస్ రికార్డ్స్‌లో టాప్ 10 లో నిలిచిన రాజాసాబ్ టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిందని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల దర్శకుడు మారుతి మాట్లాడుతూ రాజాసాబ్ సినిమాను చాలా మంది మొదట తేలికగా తీసుకున్నారు. వారందరికీ కచ్చితంగా ఇది సరైన సమాధానం ఇస్తుందని అన్నాడు. అంతే కాకుండా మారుతి వసూళ్ల విషయంలో పెద్ద మాట అన్నాడు. ప్రభాస్ గత చిత్రాలకు తగ్గకుండా ఈ సినిమా సైతం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అన్నాడు. ఆ మధ్య వచ్చిన ఒక లేడీ ఓరియంటెడ్ హర్రర్ కామెడీ మూవీ ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కనుక కంటెంట్ కనెక్ట్ అయితే రాజాసాబ్ సినిమా కచ్చితంగా రూ.1000 కోట్లకు మించి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమా పక్కా పైసా వసూళ్ మూవీ అంటూ ఫ్యాన్స్‌లో మరింతగా నమ్మకం ఏర్పడింది.
ప్రభాస్ గత దశాబ్ద కాలంగా సీరియస్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. బాహుబలి తర్వాత ఆయన మార్కెట్ అమాంతం పెరిగిన నేపథ్యంలో కామెడీ మూవీ చేయడం అంటే కచ్చితంగా కంటెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించాలి అనుకున్నాడు. అందుకే మారుతి దర్శకత్వంలో ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. బుచ్చిగాడు తరహాలో ఈ సినిమాను పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమాను మారుతి రూపొందించాడని తెలుస్తోంది. సంజయ్ దత్ వంటి బాలీవుడ్ సీనియర్ స్టార్ నటించడం ద్వారా అంచనాలు మరింత పెరిగాయి. మారుతి గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా పరిధి, బడ్జెట్ అన్ని కూడా చాలా రెట్లు ఎక్కువ.
మారుతి ఎక్కడ ఇబ్బంది పడకుండా, కాస్త ఎక్కువ సమయం తీసుకుని ఈ సినిమాను రూపొందించాడు. ప్రభాస్ మార్కెట్ రేంజ్, ఈ సినిమా కంటెంట్ విషయమై ఆయనకు ఉన్న నమ్మకం అన్ని కలిపి ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా మారుతి అన్నట్లుగా ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను క్రాస్ చేస్తుందనే విశ్వాసంను ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ విశ్లేషకులు సైతం వ్యక్తం చేసే విధంగా టీజర్ కట్ ఉంది. అన్ని విధాలుగా పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో రాజాసాబ్ సినిమా ఆ పెద్ద మార్క్‌ను చేరుకోవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మారుతి కనుక తాను అన్న ఆ పెద్ద మాటను నెరవేర్చుకుంటే కచ్చితంగా ముందు ముందు ఆయన నుంచి బిగ్ స్టార్స్ మూవీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.