ఫైనల్ గా రివీల్ అయ్యింది.. ప్రభాస్ 'ఛాంపియన్' ఆయనేనట!
అందరి నిరీక్షణకు తెరదించుతూ ప్రభాస్ ఎట్టకేలకు తన సమాధానం చెప్పారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సందీప్ రెడ్డి వంగా పోస్ట్ ని షేర్ చేస్తూ, తన ఛాంపియన్ ఎవరో ప్రపంచానికి పరిచయం చేశారు.;
రోషన్ మేక హీరోగా నటిస్తున్న 'ఛాంపియన్' సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, మేకర్స్ డిజైన్ చేసిన ఒక డిజిటల్ క్యాంపెయిన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. #MyChampion అనే హ్యాష్ ట్యాగ్ తో మొదలైన ఈ చైన్ లో ఇప్పటికే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, నాగ్ అశ్విన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. వాళ్లు తమ లైఫ్ లోని రియల్ ఛాంపియన్స్ ఎవరో చెప్పి, మరొకరిని నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన ఛాంపియన్ ఎవరో చెప్పిన తర్వాత, ఈ ఆసక్తికరమైన ప్రశ్నను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పాస్ చేశారు. దీంతో అందరి దృష్టి ప్రభాస్ సోషల్ మీడియా అకౌంట్ పై పడింది. సాధారణంగా చాలా తక్కువగా స్పందించే ప్రభాస్, దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఆయన లైఫ్ లో ఛాంపియన్ ఎవరు? అనేది తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాయి.
అందరి నిరీక్షణకు తెరదించుతూ ప్రభాస్ ఎట్టకేలకు తన సమాధానం చెప్పారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సందీప్ రెడ్డి వంగా పోస్ట్ ని షేర్ చేస్తూ, తన ఛాంపియన్ ఎవరో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ పేరు మరెవరో కాదు, దర్శకధీరుడు రాజమౌళి. అవును, "రాజమౌళి నా చాంపియన్" అంటూ ప్రభాస్ చాలా పవర్ ఫుల్ గా రిప్లై ఇచ్చారు.
ప్రభాస్ ఈ పేరు చెప్పడంలో ఆశ్చర్యం లేదు కానీ, ఆయనకు జక్కన్న మీద ఉన్న అభిమానం మరోసారి ఈ పోస్ట్ ద్వారా బయటపడింది. 'ఛత్రపతి'తో మాస్ ఇమేజ్ ని, 'బాహుబలి'తో గ్లోబల్ ఇమేజ్ ని ఇచ్చిన రాజమౌళిని ప్రభాస్ తన ఛాంపియన్ గా భావించడం నూటికి నూరు పాళ్లు కరెక్ట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ భారతీయ సినిమా స్థాయిని పెంచింది కాబట్టి, ప్రభాస్ ఛాయిస్ కి అందరూ ఫిదా అవుతున్నారు.
ఇక కేవలం ఛాలెంజ్ స్వీకరించడమే కాకుండా, యంగ్ హీరో రోషన్ కు కూడా ప్రభాస్ తన బెస్ట్ విషెస్ అందించారు. "ఛాంపియన్ ట్రైలర్ చాలా బాగుంది.. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్ రోషన్" అని అభినందించారు. అలాగే ఈ సినిమా వెనుక ఉన్న టీమ్ తనకు తెలుసని, డిసెంబర్ 25న అందరూ థియేటర్లో ఈ సినిమాను చూడాలని కోరారు. స్వప్న సినిమాస్ బ్యానర్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ కు ఆ టీమ్ తో మంచి అనుబంధం ఉంది.
ఏదేమైనా రిలీజ్ సమయానికి 'ఛాంపియన్' ప్రమోషన్స్ పీక్స్ కి చేరాయి. ఒక చిన్న ఐడియాలో ఇంతమంది స్టార్స్ భాగం అవ్వడం, చివరగా ప్రభాస్ లాంటి స్టార్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమాకు కావాల్సినంత బజ్ వచ్చేసింది. రోషన్ సినిమా కోసం స్టార్స్ అందరూ ఇలా సపోర్ట్ చేయడం నిజంగా గుడ్ బూస్ట్. మరి ఇంతమంది ఛాంపియన్స్ బ్లెస్సింగ్స్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.