మారుతి వ్యాఖ్యలకు ప్రభాస్ ఫ్యాన్స్ హర్టయారా?
డార్లింగ్ ప్రభాస్ నటించిన `ది రాజా సాబ్` 2026 సంక్రాంతి కానుకగా అత్యంత భారీగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కొన్ని తీవ్ర భావోద్వేగ సన్నివేశాలకు దారితీసింది.;
డార్లింగ్ ప్రభాస్ నటించిన `ది రాజా సాబ్` 2026 సంక్రాంతి కానుకగా అత్యంత భారీగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కొన్ని తీవ్ర భావోద్వేగ సన్నివేశాలకు దారితీసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యక్షంగా వీక్షిస్తుండగానే దర్శకుడు మారుతి వేదికపైనే తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ అట్టహాసమైన కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు వేలాది మంది అభిమానులు హాజరవ్వగా అతడి ఆవేదన అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు మూడేళ్ల పాటు `ది రాజా సాబ్` చిత్రీకరణ కొనసాగింది. రిలీజ్ కి తేవడానికి చాలా ఎదురు చూడాల్సి వచ్చింది. అగ్ర హీరోతో మొదటిసారి పని చేస్తున్న మారుతి గోల్, సినిమా స్పాన్ అంతకంతకు పెరిగిపోవడంతో బడ్జెట్ అసాధారణంగా పెరిగింది. అయినా పట్టుదలగా ఈ హారర్ కామెడీ చిత్రాన్ని అతడు పూర్తి చేసి రిలీజ్ దశకు తెచ్చాడు. దీనికోసం నిర్మాత విశ్వప్రసాద్ అడ్డు అదుపు అన్నదే లేకుండా, రాజీపడకుండా పెట్టుబడుల్ని సమకూర్చారు. అందుకే ఆ క్షణం అక్కడి వాతావరణం దర్శకుడు మారుతిని భావోద్వేగానికి గురిచేసింది. ఆయన వేదికపై ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సమయంలో మారుతి ఫ్లోలో అనేసిన ఒక మాటకు ప్రభాస్ అభిమానులు హర్టయ్యారు. తమ ఫేవరెట్ హీరోని కించపరిచేలా ఉందని, అగౌరవంగా మాట జారాడని ఫ్యాన్స్ భావించారు.
ప్రీ-రిలీజ్ వేదికపై భారతీయ సినిమా రంగంలో, ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయి ఎలా మారిందో మారుతి ప్రస్తావించారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ మారుతి ఇలా అన్నారు. ``మేం దక్షిణాఫ్రికాలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాము. నేను ఒక సినిమా దర్శకుడిని అని చెప్పినప్పుడు.. ఓహ్, నిజమా? అని నన్ను పై నుండి కిందికి చూసారు. అప్పుడు నేను నా హీరో ఎవరో మీకు తెలుసా? అని అడిగాను.. దానికి ఎవరు? అని అడిగారు. ప్రభాస్- అని చెప్పినప్పుడు ``ఓహ్.., బాహుబలి హీరోనా?`` అని ఆశ్చర్యపోయాడు. దీనిని బట్టి మసాయి మారా(దక్షిణాఫ్రికా)లోని ఒక గిరిజన తెగ ప్రజలకు కూడా ప్రభాస్ ఎవరో తెలిసిపోయింది. ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లినా ప్రభాస్ ఎవరో వారికి తెలుసు ఈరోజు.. అని అన్నాడు.
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయికి చేర్చడంలో `బాహుబలి` దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఘనతను మారుతి కీర్తించారు. రాజమౌళికి మారుతి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి దర్శకుడు రాజమౌళి గారికి చాలా చాలా రుణపడి ఉంటారు. కారణం ఏమిటంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ `పాన్ ఇండియా, పాన్ ఇండియా` అని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు.. కానీ ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి ఒక మీడియం రేంజ్ హీరోని పాన్-ఇండియా వేదికకు పరిచయం చేసి, ఈ రోజు ప్రపంచానికి ఒక భారీ కటౌట్‌ను (స్థాయిని) నిలబెట్టారు! అని మారుతి ఉద్వేగంగా మాట్లాడారు. ఎన్టీఆర్, బన్ని, చరణ్ లను పాన్ ఇండియా స్టార్లుగా ఎదగడంలో రాజమౌళి సహకారాన్ని ఈ వేదికపై మారుతి ప్రశంసించారు.
అయితే మారుతి ప్రభాస్ పై కురిపించిన ప్రేమాభిమానాలు అందరికీ నచ్చాయి కానీ పొరపాటున ప్రభాస్‌ను `మీడియం రేంజ్ హీరో` అని సంబోధించడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఒక అభిమాని స్పందిస్తూ ``నీలాంటి మీడియం రేంజ్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ ప్రభాస్ దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు`` అని కామెంట్ చేసాడు.
మరొక అభిమాని ఇలా వ్యాఖ్యానించారు. ప్రభాస్ ని ఎన్టీఆర్ సహా ఇతర హీరోలతో పోల్చి చూసారు. ప్రభాస్‌కు వర్షం, ఛత్రపతి లాంటి బ్లాక్‌బస్టర్‌లు కూడా ఉన్నాయి. అవి `ఆది`(ఎన్టీఆర్) కంటే పెద్ద సంచలనం. నిజానికి ఆ సమయంలో ఎన్టీఆర్ కంటే ప్రభాస్‌కు చాలా మంచి విజయాల పరంపర ఉంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి అన్నీ హిట్‌లే. రెబెల్‌కు కూడా భారీ హైప్ వచ్చింది. అయితే, బాహుబలి, పుష్ప, RRR వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌లకు ముందు ప్రభాస్ తన సహచరులు అయిన అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్లను టాలీవుడ్‌లో తక్కువగానే చూసారని, కాబట్టి మారుతి చెప్పింది తప్పేమీ కాదని చాలా మంది తెలుగు సినిమా అభిమానులు అతడికి మద్ధతుగా నిలిచారు.
బాహుబలికి ముందు ప్రభాస్ కు 100 కోట్ల గ్రాసర్ సినిమా లేదు.. కాబట్టి అతను మిడ్ రేంజ్ హీరోనే.. అని ఒకరు వాదించారు. 2000- 2010వ దశకం ప్రథమార్థంలో ప్రభాస్ తన సహచరులు అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారి కంటే కీర్తిప్రతిష్ఠలలో వెనుకబడి ఉన్నాడు కదా! అని మరొక అభిమాని గుర్తు చేసారు. బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత ప్రభాస్ రేంజును చూడాలని కూడా చాలామంది విశ్లేషించారు.