పూజాకు ఆ ఒక్క డోర్ మూసుకు పోయిందా..!
టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూజా హెగ్డే ఇప్పుడు ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది.;
టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూజా హెగ్డే ఇప్పుడు ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఈమెకు అసలు ఆఫర్లే లేవు. హిందీ, తమిళ్‌లో ఒకటి రెండు సినిమా ఆఫర్లు వస్తున్నా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేక పోతున్నాయి. ఈ ఏడాదిలో ఈమె నటించిన దేవ, రెట్రో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయితే రజనీకాంత్ కూలీ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్నప్పటికీ పూజా హెగ్డేకు అప్పుడే ఆఫర్లు కనుమరుగు కావడం ఆమె అభిమానులకు తీవ్రంగా నిరుత్సాహం కలిగిస్తున్నాయి. ముందు ముందు అయినా పూజా హెగ్డే టాలీవుడ్‌లో బిజీ అవుతుంది అనుకున్న అభిమానులకు మళ్లీ మళ్లీ నిరాశే మిగులుతుంది.
దుల్కర్ సల్మాన్‌కి జోడీగా పూజాహెగ్డే
తమిళ్, హిందీలో సినిమాలు చేస్తున్న పూజా హెగ్డేకు దాదాపు మూడు ఏళ్ల తర్వాత తెలుగు ఆఫర్ దక్కింది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకు గాను పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తెలుగు సినిమా, పైగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో పూజా హెగ్డే కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని అంతా భావించారు. కానీ మొత్తం తారుమారు అయింది. అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యాయి. ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. పైగా ఇదే సినిమాలో శృతి హాసన్ నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. స్వయంగా శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో తాను నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.
మరో పెద్ద సినిమా నుంచి పూజా హెగ్డే ఔట్
దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నెలకుడిటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇది ఒక ప్రేమ కథ సినిమా అంటున్నారు. ప్రేమ కథలో తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే విధంగా యాక్షన్, డ్రామా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి ఒక మంచి సినిమాలో పూజా హెగ్డే నటిస్తే ఖచ్చితంగా తెలుగులో మరిన్ని సినిమాల్లో చేసే అవకాశం దక్కి ఉండేది. కానీ ఇప్పుడు పూజా హెగ్డేకు ఈ సినిమా ఆఫర్ మిస్ కావడంతో చాలా మంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే ను తప్పించారా లేదంటే ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో ఉంటారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూజాకు తెలుగులో ఈ ఒక్క డోర్ ఉంది. అది కూడా మూసుకు పోతే టాలీవుడ్‌లో ఆమె సినిమాలు చేయడం సాధ్యం కాకపోవచ్చు.
అల్లు అర్జున్ డీజే సినిమాతో ఫామ్‌లోకి..!
తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ రెండు సినిమాలు ఆకట్టుకోలేక పోవడంతో హిందీ సినిమాలకు వెళ్లింది. దాదాపు రెండున్నర మూడు ఏళ్ల తర్వాత డీజే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అల్లు అర్జున్‌కి జోడీగా డీజే సినిమాలో నటించే అవకాశం దక్కడంతో దాదాపు ఐదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి నటన ఈమె సొంతం కావడంతో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ స్టార్ హీరోలు కనీసం ఈమె వైపు తిరిగి చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో పూజా హెగ్డే ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. చేతి వరకు వచ్చిన దుల్కర్ సల్మాన్ మూవీ చేజారింది అంటూ వస్తున్న వార్తలతో ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.